ఇది వరకు మనుషులను అలారాలు నిద్రలేపేయి. కానీ ఇప్పుడు ఆ పద్దతి మారింది. రోజంతా విసుగెత్తించే ప్రమోషన్ ఫోన్ కాల్స్.. మనల్ని నిద్రలేపుతున్నాయి. నిద్ర లేచింది మొదలు మాటిమాటికి క్రెడిట్ కార్డులు, లోన్స్ అంటూ అనేక రకాల ప్రమోషనల్ ఫోన్స్ వస్తుంటాయి. వర్క్ బిజీలో ఉన్నప్పుడు కూడా ఎవరో తెలిసిన వాళ్లే ఫోన్ చేసి ఉంటారని లిఫ్ట్ చేస్తే.. మా క్రెడిట్ కార్డ్ తీసుకోండి.. జీరో మెయింటనెన్స్ అని వినిపిస్తుంది. వర్క్ బిజీలో ఉన్న వ్యక్తికి ఇవి చాలా చికాకు తెప్పిస్తాయి. అంతేకాకుండా మరెన్నో సందర్భాల్లో కూడా ఈ ప్రమోషనల్ కాల్స్ కోపాన్ని కూడా తెప్పిస్తాయి. రోజూ ఈ ప్రమోషనల్ కాల్స్‌కు కట్ చేయలేక విసిగెత్తిపోతున్నారు వినియోగదారులు. వారి సమస్యను ఇప్పుడు ట్రాయ్(Trai) టేకప్ చేసింది. ప్రమోషనల్ కాల్స్‌కు చెక్ చెప్పడానికి రెడీ అయింది.
ఒక్క కాల్ లేదా మెసేజ్ చాలు
ఈ ప్రమోషనల్ కాల్స్ నుంచి బయట పడటానికి వినియోగదారులు చేయాల్సిందేమీ లేదు. ఒక్క కాల్ లేదా మెసేజ్ చేయడమే. అయితే ఈ ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌ల రూపం లోనే సైబర్ కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. ఏదో ప్రమోషనల్ కాల్ అనుకుని లిఫ్ట్ చేయగానే తమ బ్యాంక్ ఖాతాలు, సమాచారం మొత్తాన్ని లాగేసుకుని.. మనల్ని దోచేసుకుంటున్నారు. అందుకే వీటికి చెక్ చెప్పాలని ట్రాయ్(Trai) భావించింది. అందుకోసమే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ‘డు నాట్ డిస్టర్బ్’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మన ఫోన్‌ను స్పామ్ కాల్స్, మెసేజ్‌లు రాకుండా ఆపుతుంది. అందుకు మీరు మీ మొబైల్ నుంచి ‘STOP’ అని 1909 కి మెసేజ్ పెట్టాలి, లేదంటే అదే నెంబర్‌కి కాల్ చేసి కూడా చెప్పొచ్చు. ఈ అవకాశం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ యాప్‌లో మనకు నచ్చని వాటిని మాత్రమే బ్లాక్ చేయొచ్చు కూడా.
ఎలా వినియోగించాలంటే…
గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్‌తో యాప్‌లో లాగిన్ అవ్వాలి. అప్పుడు డ్యాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది.అక్కడ ‘ఛేంజ్ ప్రిఫరెన్స్’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ ఏ కాల్స్‌ను స్వీకరించాలనుకుంటున్నారో, వేటిని ఆపాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కనిపించే ‘డీఎన్‌డీ’ కేటగిరీలో బ్యాంకింగ్, ఫైనాన్స్‌కు సంబంధించినవి ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు, రియల్ ఎస్టేట్, విద్య వంటి కొన్ని రకాల క్యాటిరీలు ఉంటాయి. వాటిలో మనం ఆపాలనుకుంటున్న వాటిని సెలక్ట్ చేసుకోవాలి. వాటి నుంచి వచ్చే మెసేజ్‌లను కూడా బ్లాక్ చేసుకోవచ్చు. అంతేకాదు ‘ఫ్రాడ్ కాల్స్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి అక్కడ అడిగిన సమాచారం ఇవ్వడం ద్వారా ఫ్రాడ్ కాల్స్, మెసేజ్‌లపై కంప్లెయింట్ కూడా చేయొచ్చు.

