కలం, వెబ్‌డెస్క్: చాలా ఏండ్లుగా పెండింగ్ ఉన్న భారత జనాభా లెక్కలకు (India Census 2027) సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. జనాభా లెక్కల ప్రక్రియ కోసం సిబ్బందిని నియమించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు భారత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీఐ)సర్క్యూలర్ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 15లోపు ఈ నియామకాలు భర్తీ చేయాలని సూచించింది.
ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించండి
భారత జనాభా లెక్కల ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లను నియమించాలని ఆర్‌జీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. ఒక ఎన్యూమరేటర్‌ను 700 నుంచి 800 జనాభాను లెక్కించనున్నారు. ప్రతి ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించాలి. అత్యవసర పరిస్థితుల కోసం ఒక 10 శాతం మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లను రిజర్వ్‌గా ఉంచుకోవాలి.
ఎన్యూమరేటర్లుగా ఎవరిని నియమించాలి?
1990 జనాభా లెక్కల నియమాల రూల్ 3 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న టీచర్లు, క్లర్కులు లేదా ఇతర ఉద్యోగులను ఎన్యూమరేటర్లుగా నియమించాలి. సూపర్‌వైజర్ మాత్రం ఎన్యూమరేటర్ కంటే ఉన్నతస్థాయి అధికారి అయి ఉండాలి. అదనంగా, రాష్ట్రాలు జనాభా లెక్కల అధికారులను కూడా నియమించాలి. జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా ప్రభుత్వం నియమించిన ఏ అధికారి అయినా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్‌గా పని చేస్తారు. వీరు తమ పరిధిలోని జనాభా లెక్కల నిర్వహణకు బాధ్యత వహిస్తారు. డివిజన్ ఉన్న ప్రాంతాల్లో, డివిజనల్ కమిషనర్ డివిజనల్ సెన్సస్ ఆఫీసర్‌గా పనిచేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో, మున్సిపల్ కమిషనర్ ఆ సంస్థ పరిపాలనా అధికారి వరుసగా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, అడిషనల్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ లేదా ఛార్జ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.
30 లక్షల మంది అధికారుల నియామకం
రాబోయే జనగణన కోసం దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది అధికారులను నియమించాల్సి ఉంది. వీరు నిర్దిష్ట సమయంలోనే జనాభా లెక్కలను పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. సెన్సస్ 2027 కోసం సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం (CMMS) అనే వెబ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. దీనివల్ల ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, వారికి ఎన్యూమరేషన్ బ్లాకులు, సూపర్విజరీ సర్కిళ్ల కేటాయింపులు మరియు ఫీల్డ్ వర్క్ ప్రోగ్రెస్‌ను రియల్-టైమ్‌లో మానిటర్ చేస్తారు. “సెన్సస్ 2027 (India Census 2027) కోసం తీసుకొచ్చిన ఈ కొత్త పద్ధతుల దృష్ట్యా, సెన్సస్ అధికారుల నియామకాన్ని ముందుగానే ప్రారంభించి, CMMS పోర్టల్‌లో వారి పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ సహా అన్ని ప్రక్రియలను ముందుగా పూర్తిచేయడం చాలా ముఖ్యం,” అని సర్క్యులర్ తెలిపింది.
అలాగే, వాస్తవ డేటా సేకరణ నిర్వహించే ఎన్యూమరేటర్లు సూపర్వైజర్ల నియామకం తర్వాత జరుగుతుందని, అయినప్పటికీ వారిని ముందుగానే గుర్తించి CMMS పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలని పేర్కొంది. “రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన 2026 జనవరి 15లోపు సర్క్యులర్‌లో పేర్కొన్నట్లుగా సెన్సస్ భర్తీల నియామకాన్ని నిర్ధారించాలి,” అని పత్రంలో పేర్కొంది.
రెండు దశల్లో జనగణన ప్రక్రియ
జనగణన 2027 (India Census 2027) ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో గృహాలను లెక్కిస్తారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 వరకు ఈ ప్రక్రియ పూర్తి కానున్నది. రెండో దశలో జనగణన జరగనున్నది. 2027 ఫిబ్రవరిలో మార్చి 1నుంచి జనగణన జరగనున్నది. లడఖ్, జమ్మూ, కశ్మీర్ పర్వత ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో 2026 సెప్టెంబర్‌లోనే ప్రక్రియ జరగనున్నది. ఈ సారి జనగణన పూర్తిగా డిజిటల్‌గా నిర్వహించనున్నారు.
Read Also: ‘చెప్పు దెబ్బ’తో అసలుకే ఎసరు
Follow Us On: X(Twitter)


