కలం, వెబ్‌డెస్క్ : ‘బీఆర్‌ఎస్ ఉంటే ఎంత ఊడితే ఎంత, బంగారు తెలంగాణ అంటే హరీశ్ రావు.. సంతోష్ కుటుంబాలు బంగారమవ్వడమేనా?’ అంటూ కల్వకుంట్ల కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని బలంగా తాకాయి. సొంత అన్న కేటీఆర్ పైన కూడా పలుసార్లు విమర్శలు చేశారు. అలాగే, ‘బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు కొందరు కోవర్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరంజన్ రెడ్డి అవినీతి పట్టదా? హరీశ్ రావు దోపిడి కనిపించదా? బీఆర్ఎస్ హయాంలో సామాజిక న్యాయం జరగలేదు’ అని బీఆర్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆమె వ్యాఖ్యలు.. వ్యవహారం పార్టీతో పాటు కేసీఆర్ ను బాధించాయని చెప్పొచ్చు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కవిత (Kavitha) ను పార్టీ సస్పెండ్ చేసింది. కుట్రలో భాగంగానే తనను బయటకు పంపేలా చేశారని.. నాకు పట్టిన గతి కేటీఆర్(KTR) కు పట్టొచ్చని చాలా సార్లు విమర్శించారు. అయితే, పార్టీ బయటకు వచ్చిన కవితకు ఇంకా ఫ్రీడమ్ దొరికినట్లయింది. సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ‘జాగృతి జనం బాట’ను చేపట్టారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న కవిత ప్రజల సమస్యలపై గళం ఎత్తుతోంది. జిల్లాల పర్యటనలో ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.
మీడియా సమావేశాల్లో.. ప్రజల మధ్య ఉన్నప్పుడు.. సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ ను కవిత ఏకి పారేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ ఓటమిపై పరోక్షంగా స్పందిస్తూ ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే, ఈరోజు (మంగళవారం ) కవిత చేసిన ట్వీట్ లో ‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్(Deeksha Diwas)లు.. విజయ్ దివస్(Vijay Diwas)లు. ఇది ఉద్యమాల గడ్డ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని రాసుకొచ్చారు. బీఆర్ఎస్ ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రస్తుతం జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జనం బాట పేరుతో జిల్లా పర్యటనలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో కవిత బీఆర్ఎస్ పై మరింత విమర్శల బాణాలు విసిరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
Read Also: ఇండిగో సంక్షోభం.. కేంద్రం కీలక ప్రకటన
Follow Us On: Pinterest


