కలం డెస్క్ : గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఫార్మా సిటీ (Pharma City) భూ సేకరణ స్థానిక ప్రజల ఆరోపణలతో హైకోర్టులో (Telangana High Court) లీగల్ చిక్కులను ఎదుర్కొంటున్నది. ఇప్పుడు దాదాపుగా అవే భూముల్లో ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని (Future City) నెలకొల్పాలని భావిస్తున్నది. అందులో భాగంగానే రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ (Global Summit) నిర్వహిస్తున్నది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లకు ఈ భూముల్లోనే ఫ్యూచర్ రానున్నట్లు వివరించింది. విజన్ డాక్యుమెంట్లో సైతం ఫ్యూచర్ సిటీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వనున్నది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీని యాచారం మండలంలోని పలు గ్రామాల ప్రజలు గుర్తుచేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములను ఇవ్వాల్సిందేనంటూ ప్రజలపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, ప్రభుత్వ నిర్ణయం లీగల్ చిక్కులు ఎదుర్కోక తప్పదని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ హెచ్చరించింది.
ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ (Future City) :
అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్‌పై విచారణ సందర్భంగా మాత్రం దాన్ని కొనసాగిస్తామని చెప్పిందని, ఇప్పుడు అవే భూముల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించనున్నట్లు ఇన్వెస్టర్లకు చెప్తూ విజన్ డాక్యుమెంట్లో ప్రస్తావించడాన్ని అక్కడి స్థానిక ప్రజలు తప్పుపడుతున్నారు. రైతుల భూములను కాపాడుతామంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాతపూర్వకంగా మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రైతులను బలవంత పెట్టడం, బెదిరించడం సహేతుకం కాదని హెచ్చరించారు. అప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నదని ఆరోపించారు. ‘ప్రజా పాలన’, ‘ప్రజా ప్రభుత్వం’ అంటూనే ప్రజలకు ద్రోహం చేస్తున్నదని, గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధులు ప్రభుత్వ మాటలు నమ్మి మోసపోవద్దని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఇంగ్లీషు ఒక ప్రకటనను విడుదల చేసింది.
లీగల్ చిక్కులు తప్పవనే సందేశం :
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్ట ప్రకారం ఫార్మా సిటీ స్థాపనకు ఉద్దేశించిన భూముల్లో మరో ప్రాజెక్ట్ కట్టాలంటే ఇప్పటికే విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాల్సి ఉంటుందని కమిటీ పేర్కొన్నది. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం కొత్త నోటిఫికేషన్ ఇస్తే మరోసారి ప్రతీ గ్రామంలో కొత్త ప్రాజెక్ట్ రిపోర్టును తెలుగులోనే రూపొందించి ప్రజాభిప్రాయసేకరణ చేయాల్సి ఉంటుందని వివరించింది. ఫ్యూచర్ సిటీ కోసం కొత్తగా పర్యావరణ అనుమతులను కూడా తెచ్చుకోవాలని పేర్కొన్నది. ఇవేవీ చేయకుండా ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లోనే ఫ్యూచర్ సిటీ కడతామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే లీగల్‌గా అది చెల్లదని వివరించింది. యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కురమిద్ద గ్రామాల్లో తీసుకున్న భూములను స్వాదీనపర్చుకోకూడదంటూ ఫార్మా సిటీ ఏర్పాటు సందర్భంగానే రాష్ట్ర హైకోర్టు స్పష్టత ఇచ్చి ప్రభుత్వానికి స్టే ఉత్తర్వులు జారీ చేసిందని కమిటీ గుర్తుచేసింది.
Read Also: NDA హయాంలో ఈడీ, ఐటీ దూకుడు: లోక్‌సభలో వెల్లడైన సంచలన లెక్కలు!
Follow Us On: Instagram


