కలం, వెబ్‌డెస్క్: ECIR Report | కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షాలను బెదిరించేందుకు, అణగదొక్కేందుకు ఈడీ(ED), ఐటీ(IT) దాడులు చేస్తోందంటూ కొన్నేళ్లుగా విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర ఇండియా కూటమి పార్టీలు ఈ విషయంపై చాలా కాలంగా తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్లు కేంద్రం జేబు సంస్థలుగా మారాయంటూ పలుసార్లు పార్లమెంట్‌లోనూ విరుచుకుపడ్డాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే ఏకంగా ‘ఈడీ.. బోడీ’ అంటూ వ్యాఖ్యానించారు కూడా. ఈ నేపథ్యంలో గత పదకొండేళ్లుగా.. అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నమోదైన ఈడీ, ఐటీ కేసులు, సోదాలు, దాడులు, చార్జిషీట్ల నమోదు, తీర్పువచ్చినవి, శిక్ష పడినవాళ్ల సంఖ్య తదితర వివరాలను సోమవారం లోక్ సభలో కేంద్రం వెల్లడించింది. వీటిపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరాలు వెల్లడించారు.
ఈడీ పెరిగాయి.. ఐటీ తగ్గాయి:
ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ECIR Report) ప్రకారం దేశవ్యాప్తంగా 2014 నుంచి 2025 నవంబర్ వరకు 6,444 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2014–19 మధ్య ఏటా 200 కేసుల లోపే నమోదవ్వగా, ఆ తర్వాతి నుంచి ఏటా 500కు పైగా నమోదయ్యాయి. దీనికి భిన్నంగా ఐటీ కేసులు 2014 నుంచి 2019–20 మధ్య ఎక్కువగా, 2020–21 నుంచి 2025–26 మధ్య తక్కువగా నమోదయ్యాయి. 2017–18లో ఐటీ కేసులు ఏకంగా 4,527 నమోదయ్యాయి. ఆ తర్వాతి ఏడాదిలో 3,512 నమోదయ్యాయి. ఈ ఏడాది నవంబర్ వరకు 271 కేసులు మాత్రమే నమోదైనట్లు వివరాలు వెల్లడించాయి.
సోదాలు/ దాడుల్లో పెరుగుదల:
గత పదకొండేళ్లలో ఈడీ, ఐటీ సోదాలు/ దాడులు ఒకటీ రెండేళ్లు మినహా ఏటా క్రమంగా పెరుగుతున్నాయి. మొత్తంగా 2014 నుంచి 2025 నవంబర్ వరకు ఈడీ 11,106 సోదాలు/దాడులు నిర్వహించగా, ఐటీ 9,657 చేసింది. ఇక 2014–15 నుంచి 2025 నవంబర్ వరకు ఈడీలో ఫిర్యాదులు, అనుబంధ ఫిర్యాదుల సంఖ్య 2,416 కాగా; ఐటీలో 16,404.
తీర్పులు 53.. దోషులు 121:
2014 ఏప్రిల్ 1 నుంచి పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులు 56 మనీలాండరింగ్ కేసుల్లో తీర్పులిచ్చాయి. ఇందులో 53 కేసుల్లో ఆరోపణలు రుజువయ్యాయి. 121 మందికి శిక్ష పడింది. మిగిలిన 3 కేసులు వీగిపోయాయి. అంటే దాదాపు 94.64శాతం కేసుల్లో ఈడీ శిక్షలు వేయించగలిగింది. అదే సమయంలో గత పదకొండేళ్లుగా ఐటీ కేసుల్లో సగానికి పైగా విత్ డ్రా కావడం గమనార్హం. నిజానికి వీటిలో గత పదకొండేళ్లలో నమోదైన వాటితోపాటు అంతకుముందువీ ఉన్నాయి. అందుకే డేటా పూర్తి వివరాలు వెల్లడించలేదు. మొత్తానికి గత పదకొండేళ్లలో 522 ఐటీ కేసుల్లో తీర్పు కాగా, 963 కేసులు వీగిపోయాయి. 3,345 కేసులు విత్ డ్రా అయ్యాయి. కాగా, రాష్ట్రాల వారీ వివరాలు అందుబాటులో లేవని కేంద్రం బదులిచ్చింది.
Read Also: గ్రామస్తుల మేనిఫెస్టో.. తెలంగాణ డల్లాస్‌గా అంకాపూర్
Follow Us On: Pinterest


