Mobile Popup Ad
Mobile Popup Ad

రంగప్ప చెరువుకు పూర్వవైభవం ఎప్పుడు?

కలం, జనగామ : జనగామ (Jangaon) పట్టణానికి రంగప్ప చెరువు (Rangappa Cheruvu) ఒకప్పుడు జీవనాడి. సాయంత్రం వేళ చల్లని గాలి కోసం, స్వచ్ఛమైన నీటి కోసం పట్టణ ప్రజలు ఇక్కడికి వచ్చేవారు. కానీ కాలక్రమేణా, ఆ చెరువు కేవలం ఎన్నికల మేనిఫెస్టోలలో మాత్రమే అందంగా కనిపిస్తోందే తప్పా తర్వాత పట్టించుకున్న నాథుడే లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ పట్టణ ప్రజలు మాత్రం అభివృద్ధి జరగకపోదా అని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.

ఎన్నికలప్పుడే హడావుడి!

ఎన్నికల నగారా మోగగానే నాయకులంతా రంగప్ప చెరువు కట్టపై నిలబడి ఊహల పల్లకీలు ఊరేగిస్తారు. “దీన్ని మినీ ట్యాంక్ బండ్‌గా మారుస్తాం”, సిద్ధిపేట చెరువు లా తీర్చిదిద్దుతాం”, జనగామ (Jangaon)కు ఇదొక ఐకాన్ అవుతుంది” అంటూ మైకుల ముందు గంభీరమైన ప్రసంగాలు చేస్తారు. ప్రతీ సారి మునిసిపాలిటీ ఎలక్షన్స్ నుండి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వరకు ఇదే పల్లవి వినిపిస్తుంది.

వాగ్దానాల వెల్లువ, ఆశతో ప్రజలు:

నాయకుల మాటలు నమ్మి జనగామ ప్రజలు కూడా ఆశపడ్డారు. చెరువు చుట్టూ మెరిసిపోయే విద్యుత్ దీపాలు, వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల కోసం పార్కులు, బోటింగ్.. ఇలా ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం తమ నగరంలో రాబోతుందని కలలు కన్నారు. ఆ ఆశతోనే ఓట్లు వేసి గెలిపించారు. గెలిచిన తర్వాత నాయకులు హామీలు గాలికోదిలేయడం పరిపాటిగా మారుతూ వస్తోంది. ఎన్నికలు ముగిసి నాయకులు కుర్చీల్లో కూర్చున్నారు. కానీ రంగప్ప చెరువు తలరాత మాత్రం మారలేదు. నేడు ఆ చెరువు పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. పట్టణంలోని మురుగు నీరంతా నేరుగా చెరువులోకి చేరుతోంది. గుర్రపుడెక్క అల్లుకుపోయి, దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు చెరువు శిఖం భూములు మెల్లమెల్లగా కబ్జాలకు గురవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిధుల లెక్కలు – నిశ్శబ్ద పోరాటం:

అప్పుడప్పుడు “కోట్లాది రూపాయల నిధులు మంజూరయ్యాయి” అనే వార్తలు పత్రికల్లో వస్తాయి. కానీ ఆ నిధులు ఎటు పోతున్నాయో, పనులు ఎందుకు మొదలుకావడం లేదో ఎవరికీ అర్థం కాదు. అధికారులను అడిగితే ‘టెండర్లు’, ‘ప్లానింగ్’ అని కాలయాపన చేస్తుంటారు. రాజకీయ నాయకుల అపరిపూర్ణ హామీలకు నిదర్శనంగా రంగప్ప చెరువు నేడు జనగామ అభివృద్ధికి ఐకాన్ కాదు, రాజకీయ నాయకుల అపరిపూర్ణ హామీలకు నిదర్శనంగా నిలిచింది. ఒకప్పుడు పర్యాటక కేంద్రం అవుతుందనుకున్న చోట ఇప్పుడు దోమలు, దుర్వాసన రాజ్యమేలుతున్నాయి. తమ ఓటు ద్వారా ఇచ్చిన అధికారం, ఆ చెరువుకు మళ్ళీ పూర్వ వైభవం ఎప్పుడు తెస్తుందా అని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Read Also: ఎడారి వెలుగులను కమ్మిన చీకటి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>