కలం, వెబ్ డెస్క్ : ఐఏఎస్ అధికారి కాటా ఆమ్రపాలి (IAS Amrapali)కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ రాష్ట్రానికి స్వాప్ (పరస్పర బదిలీ) ప్రతిపాదనను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆమె తరఫు న్యాయవాదికి ఆరు వారాల గడువు ఇచ్చింది. అప్పటివరకు ఆమె ఆంధ్రప్రదేశ్‌లోనే విధులు నిర్వర్తించాలని స్పష్టం చేసింది. క్యాట్ (CAT – సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. డీవోపీటీ వాదనను సమర్పించింది. ఆరు వారాల తర్వాత జరిగే విచారణ తర్వాత ఆమె ఏ రాష్ట్రంలో డ్యూటీ కంటిన్యూ చేయాలనే అంశంలో స్పష్టత రానున్నది.
ఇంతకూ ఏమిటి వివాదం :
తెలంగాణ ఏర్పాటు సమయంలో ఐఏఎస్ అధికారులను ప్రత్యూష్ సిన్హా కమిటీ రెండు రాష్ట్రాలకు కేటాయించింది. ఇందుకు కేంద్ర సర్వీసు నిబంధనలతో పాటు డీవోపీటీ (DoPT) రూపొందించిన మార్గదర్శకాలను కమిటీ ప్రామాణికంగా తీసుకున్నది. ఆ ప్రకారం ఐఏఎస్ కాటా ఆమ్రపాలిని (IAS Amrapali) ఏపీకి కేటాయించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆమె క్యాట్‌ను ఆశ్రయించారు. తెలంగాణలో కొనసాగేందుకు ఆసక్తి చూపారు. దీన్ని పరిశీలించిన క్యాట్ ఆమెను తెలంగాణకు కేటాయించింది. దీన్ని సవాలు చేస్తూ డీవోపీటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ వాదనల అనంతరం క్యాట్ ఉత్తర్వులను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు గతేడాది ఆమెను ఏపీకి కేటాయించింది. ఉత్తర్వుల మేరకు ఆమె ఆ రాష్ట్ర సర్వీసుల్లో జాయిన్ అయ్యారు. తెలంగాణలోనే కొనసాగాలన్న ఆమె ఆసక్తి మేరకు మరోసారి క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై సోమవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి.
ఆరు వారాల తర్వాతే క్లారిటీ :
వాదనల సందర్భంగా డీవోపీటీ తరఫున హాజరైన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ భుజంగరావు అనేక అంశాలను లేవనెత్తారు. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న హరికిరణ్ అనే ఐఏఎస్ అధికారి ఏపీకి వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నందున స్వాప్ (SWAP) పద్ధతిలో వీరిద్దరి పరస్పర బదిలీకి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనపై వాదించారు. హరికిరణ్ ఎస్సీ కేటగిరీలో ఉన్నారని, ఆమ్రపాలి ఆ కేటగిరీకి చెందినవారు కాకపోవడంతో స్వాప్ పద్ధతి చెల్లదనే వాదనలు కూడా జరిగాయి.
ఏపీ ప్రభుత్వం తరఫున గవర్నమెంటు ప్లీడర్ రాజేశ్వర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు సీజే బెంచ్… ఆమె తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి ఆరు వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత జరిగే విచారణలో ఆమ్రపాలి ఏ రాష్ట్రంలో సేవలందించాలనే అంశంలో స్పష్టత వస్తుంది. అప్పటివరకూ యధావిధిగా ఇప్పుడు పనిచేస్తున్న ఏపీలోనే కొనసాగాలని పేర్కొనడంతో పాటు ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ ఇటీవల క్యాట్ వెలువరించిన ఉత్తర్వులపై స్టే విధించింది. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
Read Also: కవిత నెక్ట్స్ టార్గెట్ ఎవరు..?
Follow Us On : X(Twitter)


