epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అవమానం నుంచి పుట్టిన జాగృత గీతం.. వందేమాతరం

కలం, వెబ్​ డెస్క్​: అవమానం.. సమాజ గతిని, ప్రపంచ రీతిని మార్చిన అనేక ఉద్యమాలకు శక్తిమంతమైన ఆయుధం. ముఖ్యంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం జరిగిన చిరస్మరణీయ పోరాటాలకు ఇదే ఇంధనం. అబ్రహాం లింకన్​, మహాత్మా గాంధీ, మార్టిన్​ లూథర్​ కింగ్​, నెల్సన్​ మండేలా.. ఒక్కరేమిటి? ఎంతో మంది మహనీయులను లక్ష్యం వైపు నడిపించింది ఇదే. అలాంటి ఓ అవమానమే.. కోట్లాది భారతీయులను ఒక్కటిగా చేసిన గీతానికి ప్రాణం పోసింది. రవి అస్తమించని బ్రిటిష్​ సామ్రాజ్యాన్ని దేశం నుంచి తరిమికొట్టేందుకు ఆసేతుహిమాచలాన్ని గళమెత్తేలా చేసింది. ఆ జన జాగృత గీతమే వందేమాతరం (Vande Mataram). భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భాగమైన ఈ గీతం పుట్టి ఈ ఏడాది నవంబరు 7తో 150 ఏళ్లు వసంతాలు వచ్చాయి. ఈ సందర్భంగా నేడు (డిసెంబర్​ 8న) లోక్​ సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ క్రమంలో కోట్లాది భారతీయుల గుండె గీతమైన వందేమాతరం ఎలా పుట్టిందో తెలుసుకుందాం.

మేనాలోంచి లాగి పడేయడంతో..

బంకించంద్ర ఛటోపాధ్యాయ.. ప్రసిద్ధ బెంగాలీ కవి, రచయిత, ఉన్నత విద్యావంతుడు. 1838, జూన్​ 26న జన్మించారు. బ్రిటీష్​ ప్రభుత్వంలో డిప్యూటీ మేజిస్ట్రేట్​ గా పనిచేసేవారు. ఓ రోజు పని మీద మేనా (పల్లకీ)లో వెళుతున్నారు. కాస్త దూరం వెళ్లగానే హఠాత్తుగా ఎక్కడి నుంచో ఆ ఏరియా కల్నల్​ ఊడిపడ్డాడు. మేనాలో వెళ్తున్న బంకించంద్రను చూసి ఆవేశం పట్టలేకపోయాడు. ‘నల్లవాడివి.. నీకు పల్లకీ కావాల్సొచ్చిందా? వెంటనే దిగిపో ..’ అంటూ గట్టిగా అరిచాడు. పల్లకీని మోస్తున్న బోయీలు భయంతో ఆగిపోయారు. ‘ఆయన మన డిప్యూటీ మేజిస్ట్రేట్​’ అంటూ అతని పక్కనున్నవాళ్లు హెచ్చరిస్తున్నా..‘అయితే ఏంటి?’అంటూ నేరుగా పల్లకీ వద్దకు వచ్చి బంకించంద్రను బయటకు లాగాడు. పిడిగుద్దులు గుద్దాడు.తానెవరో తెలిసినా అహంకారంతో తనను అవమానపర్చిన ఆ కల్నల్​ పై మండిపడ్డాడు బంకించంద్ర. ఆ కల్నల్​ కాస్త తగ్గి ‘సారీ ’ చెప్పినా అంగీకరించలేదు. తనకు జరిగిన అవమానానికి కోర్టులో బహిరంగ క్షమాపణ చెప్పించుకునేవరకు వదల్లేదు.

ఆ ఆలోచనే..

తనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకున్నా ఆ సంఘటన బంకించంద్ర మనసులోంచి చెరిగిపోలేదు. ‘అధికారినైన నన్నే అవమానిస్తే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?’ అనే ఆలోచన తలెత్తింది. అదే సమయంలో బ్రిటీష్​ ప్రభుత్వం ‘గాడ్​ సేవ్​ ద కింగ్​ ’ అనే తమ ప్రార్థనా గీతాన్ని భారత జాతీయ గేయంగా ప్రకటించాలని చూస్తోందని తెలిసింది. అంతే, ఆ ఆవేశంలో ఆయన కలం నుంచి పుట్టిన గీతమే ‘వందేమాతరం’. మొదట రెండు పాదాలతో పురుడు పోసుకున్న ఆ గీతం పుట్టింది నవంబర్​ 7, 1875.ఆ తర్వాత మరో పాదాలను గీతానికి జత చేశాడాయన. అదే గీతాన్ని తాను రాసిన ఆనంద్​ మఠ్​ నవలలో మొదటిసారి ప్రచురించాడు. ఈ గీతానికి బాణీ కట్టింది, తొలిసారి పాడింది మహాకవి రవీంద్రనాథ్​ ఠాగూర్​. 1886లో జరిగిన కలకత్తా కాంగ్రెస్​ సమావేశంలో ఆయన ఈ గీతాన్ని హృద్యంగా ఆలపించారు.

కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా..

బెంగాల్​ విభజన సమయంలో వందేమాతరం(Vande Mataram) గీతం మారుమోగింది. ఆ తరువాత క్రమంగా ఇది దేశమంతా విస్తరించింది. అన్ని భాషల్లోకి తర్జుమా అయ్యింది. స్వతంత్ర పోరాట సమయంలో కోట్లాది భారతీయల గొంతుల్లో పిక్కటిల్లింది.భారతీయులందరినీ ఏకతాటిపై నడిపింది. బ్రిటీష్​ వారిని తరిమికొట్టడంలో తనవంతు పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం వచ్చాక ఈ గీతాన్ని భారత ప్రభుత్వం జాతీయ గేయంగా ప్రకటించింది.అవమానం నుంచి పుట్టిన ఈ గీతం ప్రతి భారతీయుని గుండెలో ఎప్పటికీ పదిలం. ఎన్ని యుగాలు గడచినా ఆరని నిత్య చైతన్య దీప్తి ’వందేమాతరం’.

Read Also: కోల్​ కతాలో బాబ్రీకి పోటీగా గీతా పారాయణం!!

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>