కలం డెస్క్ : బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి హుండీ రికార్డ్ సృష్టించిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన గురువారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్రహ్మోత్సవాలు జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. టీటీడీ కల్పించిన సదుపాయాలు, సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన 8 రోజుల్లో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని 5.8 లక్షల మంది దర్శించుకున్నారని తెలిపారు.
అదే విధంగా శ్రీవారి హుండీ ఆదాయం ఈ ఎనిమిది రోజుల్లో రూ.25.12 కోట్లుగా నమోదయినట్లు ప్రకటించారు. 28 లక్షలకుపైగా లడ్డూలను భక్తులను కొనుగోలు చేశారని, 26 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించామని వెల్లడించారు. 2.42 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు. తిరుమల నుంచి తిరుపతికి ఈ ఎనిమిది రోజుల్లో 5.22 లక్షల మంది ప్రయాణించారని ఆయన చెప్పారు.

