epaper
Friday, January 16, 2026
spot_img
epaper

కాజీపేట బ్రిడ్జి.. కట్టేదెన్నడు..?

కలం, వరంగల్ బ్యూరో : కాజీపేట బ్రిడ్జి (Kazipet Bridge) ఇంకెన్నడు కడుతారు. నాలుగేళ్లుగా నత్తనడకనే సాగుతోంది. ఇప్పట్లో అసలు కంప్లీట్ అవుద్దా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. వరంగల్, హైదరాబాద్ హైవే మీద కాజీపేట్ రైల్వే లైన్ పై నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జి అది ఇరుకుగా మారింది. పరిస్థితుల దృష్ట్యా ప్రయాణానికి ఎంతో సౌకర్యం గా ఉండేది. కానీ మారిన ప్రస్తుత పరిస్థితుల కారణంగా బ్రిడ్జి ఇరుకుగా మారింది. నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎక్కువై వాహనదారులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కిందట బ్రిడ్జి పక్కనే మరో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టినా… అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల పట్టింపు లేని తనంతో బ్రిడ్జి పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. దీంతో ప్రజల కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

నాలుగేళ్లుగా కొనసాగుతూ..

హనుమకొండ నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే మీద ఉన్న కాజీపేట వంతెన ఇరుకుగా ఉండటం తో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో నిత్యం వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన జనాభా, వాహనాల రద్దీ కారణంగా 2021లో అప్పటి ప్రభుత్వం కాజీపేట బ్రిడ్జి (Kazipet Bridge) పక్కనే కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.72 కోట్లు మంజూరు చేసింది. రైల్వే నుంచి స్థల సేకరణ చేపట్టి పనులు ప్రారంభించింది. రెండేళ్లలో రైల్వే ట్రాక్ కు ఇరు వైపులా నిర్మాణ పనులు పూర్తి చేశారు. అయితే రైలు పట్టాల పైన అమర్చే ఇనుప వంతెన నిర్మాణం చేపట్టినప్పటికీ అమర్చటంలో రైల్వేశాఖ, ఆర్ అండ్ బీ అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఫలితంగా బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

తీరని ట్రాఫిక్ కష్టాలు..

కాజీపేట వద్ద రైల్వే లైన్ పై నిర్మిస్తున్న బ్రిడ్జి జాతీయ రహదారిపై ఉండడం, నిత్యం వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులతో విపరీతమైన రద్దీ నెలకొంటుంది. దీంతో ఈ సమస్యను అధిగమించే క్రమంలో ప్రయాణికులను ఆకట్టుకునేలా కోల్‌కతా సమీపంలో ఉన్న హౌరా బ్రిడ్జిని తలపించేలా ఇనుప గడ్డర్లతో కొత్త మోడల్‌లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఆ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే బ్రిడ్జిని పూర్తి చేయటంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటం వల్ల ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.

రైల్వే విద్యుత్‌ లైన్‌ పై పనులు చేపట్టేందుకు రైల్వేశాఖ ఆఫీసర్లు పర్మిషన్లు ఇవ్వటంలో నిర్లక్ష్యం చేస్తున్నారని నగర వాసులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా బ్రిడ్జి నిర్మాణం పనులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మాణం చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పనులపై ప్రజాప్రతినిధుల చొరవ చూపాలని, రైల్వేశాఖ, ఆర్ అండ్ బీ అధికారులను సమన్వయం చేసి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయించి హైదారాబాద్-వరంగల్ జాతీయ రహాదారిపై వెళ్లే వాహనదారుల కష్టాలు తీర్చాలని నగర వాసులు కోరుతున్నారు.

Read Also: గెలుపు కోసం తాంత్రిక పూజలు.. ‘స్థానిక‘ పోరులో చిత్ర విచిత్రాలు

Follow Us On : X(Tiwtter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>