Mobile Popup Ad
Mobile Popup Ad

రోహిత్, కోహ్లీపై ఆకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2026లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సృష్టించిన విధ్వంసంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా రోహిత్, విరాట్ కోహ్లీ తమను తాము అప్‌గ్రేడ్ చేసుకున్నారని, వీరు టెస్టుల నుంచి ఎందుకు రిటైర్ అయ్యారో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనకు ముందే రోహిత్, కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

తాజాగా ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌ల్లో వీరిద్దరూ అద్భుత ఫామ్‌ను కనబరిచారు. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ (Kohli) 69 పరుగులతో రాణించగా, ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో రోహిత్ (Rohit) కేవలం 38 బంతుల్లో 78 పరుగులు బాది ముంబైకి విజయాన్ని అందించారు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆకాష్ చోప్రా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన ఈ వెటరన్ జోడీలో కసి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

రోహిత్ ఎంతో ఫిట్‌గా కనిపిస్తున్నారని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా పూర్తిస్థాయి ఆటగాడిగా తన సత్తా చాటుతున్నారని కొనియాడారు. టి20ల నుంచి తప్పుకున్నా అర్థం ఉండేదని, కానీ ఇంత మంచి టెక్నిక్ ఉన్న వీరు టెస్టులకు ఎందుకు గుడ్ బై చెప్పారో అని ఆయన ప్రశ్నించారు. కేకేఆర్ (KKR) నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై సునాయాసంగా ఛేదించింది. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ పరుగుల వరద పారించారు.

వీరిద్దరూ మొదటి వికెట్‌కు కేవలం 11.5 ఓవర్లలోనే 148 పరుగులు జోడించడం విశేషం. రికెల్టన్ 81 పరుగులతో ఆకట్టుకున్నాడని, ఇకపై క్వింటన్ డికాక్ ఫిట్‌గా ఉన్నా తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్లు ఎంతో క్లారిటీతో, అలవోకగా సాగాయని చోప్రా ప్రశంసించారు. ప్రస్తుతానికైతే సీనియర్ ఆటగాళ్లు తమ బ్యాటింగ్‌తో పాత రోజులను గుర్తుకు తెస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Read Also:  భార‌త్‌లో చైనా CCTV కెమెరాల‌పై నిషేధం.. ఎందుకంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>