కలం డెస్క్ : ఎప్పటిలా తరగతులు జరుగుతున్నాయి. పిల్లలకు టీచర్లు పాఠాలు చెప్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా స్కూల్ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. శిథిలాల కింద 90మందికిపైగా విద్యార్థులు చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఉన్న సిడోర్జో నగరంలో చోటు చేసుకుంది.
నగరంలో ఉన్న అల్ ఖోజిని ఇస్లామిక్ స్కూల్ కుప్పకూలిన ఘటనలో దాదాపు వందమందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం రెండు రోజుల క్రితం జరిగింది. కాగా ఇంకా 91 మంది విద్యార్థులను శిథిలాల నుంచి బయటకు తీయాల్సి ఉంది. శిథిలాల కింద ఉన్న విద్యార్థులకు సహాయక సిబ్బంది.. టూబ్‌ల సహాయంతో నీరు, ఆక్సిజన్ అందిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గంటలతరబడి సహాయక చర్యలు జరిపిన తర్వాత ఎనిమిది మంది విద్యార్థులను సురక్షితంగా బయటక తీసినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

