కలం డెస్క్ : ఇండిగో (INDIGO) విమాన సర్వీసుల సంక్షోభంతో పలు ఎయిర్ లైన్స్ కంపెనీలు ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు(Flight Ticket Prices) పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పౌర విమానయాన శాఖ దూరానికి తగినట్లు రేట్ ఫిక్స్ చేసింది. 500 కి.మీ. కంటే తక్కువ దూరమున్న ప్రయాణానికి రూ. 7,500 టికెట్ ధర మించవద్దని స్పష్టం చేసింది. వెయ్యి కి.మీ. దూరానికి రూ. 12 వేలు, 1500 కి.మీ. దూరానికి రూ. 15 వేలు, అంతకంటే ఎక్కువ దూరముంటే రూ. 18 వేలకు మించకుండా ధరలను నియంత్రించింది. డొమెస్టిక్ ఫైట్లలో సాధారణ ప్రయాణానికి మాత్రమే దీన్ని పరిమితం చేసింది. బిజినెస్ క్లాస్‌కు ఈ ధరలు వర్తించవని వివరణ ఇచ్చింది. పౌర విమానయాన శాఖ ఫిక్స్ చేసిన ధరలలో యూడీఎఫ్ (UDF – యూజర్ డెవలప్‌మెంట్ ఫీజ్), పీఎస్ఎఫ్ (PSF – ప్యాసింజర్ సర్వీస్ ఫీ), ఇతర పన్నులన్నీ కలిసే ఉంటాయని, అదనంగా వసూలు చేయవద్దని ఎయిర్‌లైన్స్ సంస్థలకు, ఆన్‌లైన్ రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్ కంపెనీలకు క్లారిటీ ఇచ్చింది.
విచ్చలవిడి టికెట్ రేట్లకు కళ్ళెం :
ఇండిగో సంక్షోభాన్ని సాకుగా తీసుకుని పలు ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ కంపెనీలు విచ్చలవిడిగా టికెట్ ధరలను(Flight Ticket Prices) పెంచేశాయి. ఇండిగో ఫ్లైట్లు ఎలాగూ నడవటంలేదనే కారణంతో ప్రయాణికుల ఆందోళనను అవకాశంగా తీసుకుని ఆరేడు రెట్ల చొప్పున ధరలను పెంచేశాయి. ఉదాహరణకు ఢిల్లీ-ముంబై టికెట్ ధర గరిష్టంగా రూ. 93 వేలకు, ఢిల్లీ-బెంగళూరు ధర రూ. 92 వేలకు, ఢిల్లీ-కోల్‌కతా టికెట్ రూ. 94 వేలకు, ఢిల్లీ-చెన్నయ్ ధర రూ. 80 వేలకు పెరిగింది. మామూలు రోజుల్లో ఈ రూట్లలో ఫ్లైట్ టికెట్ ధరలు రూ. 20 వేలకు మించవు. పార్లమెంటు సమావేశాలు, వీకెండ్స్, ఫెస్టివల్ సీజన్.. ఇలాంటి సమయాల్లో మాత్రం అది రూ. 30 వేలకు చేరుకుంటుంది. కానీ ఇప్పుడు ఏకంగా లక్ష మార్కుకు చేరుకోవడంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని గమనంలోకి తీసుకున్న పౌర విమానయాన శాఖ నియంత్రణ వ్యవస్థను తీసుకొచ్చింది.
Read Also: డీప్ ఫేక్ నియంత్రణకు బిల్లు
Follow Us On: X(Twitter)


