కలం, వెబ్‌డెస్క్: న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (New York Telangana Telugu Association) కొత్త అధ్యక్షుడిగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాదిపాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగు వారు ఏర్పాటు చేసుకున్న సంస్థ NYTTA. సంస్థ సభ్యులు 2026వ సంవత్సరం కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. న్యూయార్క్‌లో వేలసంఖ్యలో తెలుగు, తెలంగాణ కుటుంబాలు స్థిరపడ్డాయి. వీరందరూ వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు. వీరంతా ఒక సమూహంగా కలిసి ఉండేందుకు ఆరేళ్ల కింత నైటాను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సంస్థ ఆధ్వర్యంలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. అమెరికాలోనే పుట్టి పెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, NYTTA సభ్యులు పాల్గొన్నారు.
రవీందర్ కోడెల ప్రస్థానమిదే..
రవీందర్ కోడెలది తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా. ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం. బాల్యం నుంచి పదో తరగతిదాకా అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. అనంతరం డాక్టర్ రెడ్డీస్‌తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తోపాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.


