కలం డెస్క్ : క్రెడిట్ కార్డుమీద కొత్త మొబైల్ ఫోన్ కొని ఈఎంఐ(EMI) చెల్లించట్లేదా? ఒకసారే ఎగ్గొట్టానని లైట్ తీసుకుంటున్నారా?.. అయితే మీకు తొందర్లో షాక్ తగలబోతున్నది. ఒక్క ఈఎంఐ పేమెంట్ చెల్లించకపోయినా మీ మొబైల్ ఫోన్ లాక్ అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. క్రెడిట్ కార్డు మీద ఏదైనా వస్తువు కొని ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐ కట్టకపోతే గతంలో బ్యాంకు సిబ్బంది ఇండ్లకు వచ్చి నోటీసులిచ్చేవారు. బౌన్సర్ల లాంటివారితో బెదిరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి అవసరమేదీ లేకుండా ఈఎంఐ పద్ధతిలో ఫోన్ కొన్న తర్వాత ఒక్క నెల వాయిదా కట్టకపోయినా ఆ మొబైల్ ఐఎంఈఐ నెంబర్ ద్వారా డిజిటల్ లాక్ చేసే ఆలోచన ఉన్నట్లు రిజర్వు బ్యాంకు(RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
సాధ్యాసాధ్యాలపై అధ్యయనం :
ఒకవైపు వినియోగదారుల హక్కులు, ప్రైవసీ.. మరోవైపు రుణం ఇచ్చిన బ్యాంకులు, ద్రవ్య సంస్థల నిబంధనలు.. ఇలాంటి అంశాలు కూడా గమనంలో ఉన్నందున ‘డిజిటల్ లాక్’ లేదా ‘రిమోట్ బ్లాక్’ రూపంలో ఆ ఫోన్ పనిచేయకుండా చేయడంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ విధానాల్లోని మంచి, చెడులను (బెనిఫిట్స్, డ్రా బ్యాక్స్) అధ్యయనం చేసిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు వివరించారు. ప్రస్తుతం ‘డిజిటల్ లాక్’ అనేది పరిశీలన స్థాయిలోనే ఉన్నదన్నారు. ఒకవేళ ‘డిజిటల్ లాక్’ విధానం అమల్లోకి వస్తే ఆ మొబైల్ ఫోన్‌లో ఏ కంపెనీకి సంబంధించిన సిమ్ కార్డు ఉన్నా పనిచేయదు. ఆ ఫోన్‌లోని డాటా, ఇమేజెస్.. ఇలాంటివన్నీ యాక్సెస్ చేయడానికి వీలు ఉండదు. గతంలో లాగా బ్యాంకు సిబ్బంది మన ఇండ్ల ముందుకు వచ్చి నోటీసులు ఇవ్వడం, బౌన్సర్ల వేధింపులు.. ఇలాంటివేమీ లేకుండా సింపుల్‌గా ‘డిజిటల్ లాక్’తో చెక్ పెట్టాలన్నది ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశం.

