కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy) ఇటీవల పవన్ కల్యాణ్ మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో చూశాం. ఆయన సినిమాలు ఆడనివ్వబోమని కూడా హెచ్చరించారు. దిష్టి వ్యాఖ్యలపై పవన్ సారీ చెప్పాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఏపీలోని అమరావతికి చేరుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గ్లోబల్ సమ్మిట్(Global Summit) కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పవన్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా.. కోమటిరెడ్డి కూల్‌గా సమాధానం చెప్పారు. చిన్న చిన్న వివాదాలు జరుగుతుంటాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలపై కాస్త మెత్త బడ్డట్టే కనిపించింది. రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పొగడ్తల వర్షం కురిపించారు.
‘చంద్రబాబు(Chandrababu) ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 తీసుకొస్తే మేం పెద్దగా పట్టించుకోలేదు. అసలు హైటెక్ సిటీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కూడా ఊహించలేదు. కానీ నేడు ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది’ అంటూ కోమటిరెడ్డి(Minister Komatireddy) గుర్తు చేశారు.
2047నాటికల్లా 3 ట్రిలియన్ ఎకానమీ తీసుకురావాలన్నదే తమ లక్ష్యమన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామని.. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. చంద్రబాబును వ్యక్తిగతంగా ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి సూచించడంతో తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చేసుకుంటున్నాయని గుర్తు చేశారు.
Follow Us On: Facebook


