కలం, వెబ్‌డెస్క్: సంచార్ సాథీ యాప్(Sanchar Saathi) గొడవ సద్దుమణిగే లోపలే కేంద్రం మరో కొత్త వివాదానికి తెరతీసింది. మొబైల్ కంపెనీలు ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ జీపీఎస్(GPS) కచ్చితంగా ఎనేబుల్ చేసేలా ఆదేశించాలనే టెలికాం శాఖ ప్రతిపాదనను సమీక్షిస్తోంది. దీనికి ఆమోదం లభిస్తే ప్రతి మొబైల్‌లోనూ ఇన్‌బిల్ట్‌గా జీపీఎస్ ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. అయితే, ఈ నిర్ణయాన్ని యాపిల్, గూగుల్, సామ్‌సంగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ప్రభుత్వ ప్రతిపాదన వెనక..:
ఏదైనా నేరానికి సంబంధించిన దర్యాప్తు విషయంలో కచ్చితమైన లొకేషన్ గుర్తించేందుకు దర్యాప్తు సంస్థలు టెలికాం కంపెనీలకు లీగల్‌గా రిక్వెస్ట్ చేసుకోవాలి. అయితే, ఇందులో టెలికాం కంపెనీలు ఇచ్చే లొకేషన్‌లో కచ్చితత్వం ఉండదు. కారణం, అవి ఆయా టెలిఫోన్ టవర్ పరిధిని మాత్రమే చెప్తాయి. కానీ, కచ్చితమైన లొకేషన్ ఇవ్వలేదు. ఇది దర్యాప్తులపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను అధిగమించాలంటే కచ్చితమైన లొకేషన్ తప్పనిసరి. నిజానికి మొబైల్‌లో లొకేషన్ ఆన్ చేసుకొనే వెసులుబాటు ఉన్నా చాలా మంది చేయరు. ఈ సమస్యను పరిష్కరించాలంటే మొబైల్స్‌లో జీపీఎస్(GPS) ఇన్‌బిల్ట్‌గా ఆన్‌లో ఉంచేలా చేస్తే సరిపోతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ (సీవోఏఐ) పరిధిలోని రిలయన్స్, ఎయిర్‌టెల్ కేంద్రానికి చెప్పాయి. ఈ క్రమంలోనే ఇన్‌బిల్ట్‌గా లొకేషన్ ఆన్‌లో ఉండేందుకు జీపీఎస్‌ను ప్రతి మొబైల్‌లో తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఇప్పటికే దీనిపై సమాచారం తెలియడంతో యాపిల్, సామ్‌సంగ్, గూగుల్ కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకించాయి. భారత ప్రభుత్వ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని అంటున్నాయి.
వెనక్కి తగ్గినట్లే తగ్గి..:
రెండేళ్ల కిందట కేంద్రం సంచార్ సాథీ యాప్‌ను తెచ్చిన సంగతి తెలిసిందే. సైబర్ మోసాలను అరికట్టడం, పోగొట్టుకున్ ఫోన్లను గుర్తించడం, వినియోగదారుల డిజిటల్ వివరాలను రక్షించడం, ఐఎంఈఐ నెంబర్‌ను ప్రామాణికతను ధృవీకరించడం ఈ యాప్ నిర్వహిస్తుందని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. ప్రజల భద్రతకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. అయితే, ఇటీవల ఈ యాప్‌ను ప్రతి మొబైల్‌లోనూ తప్పనిసరిగా అందించాలని తయారీ కంపెనీలను ఆదేశించింది. దీనిపై ప్రతిపక్షాలు, స్మార్ట్‌ఫోన్ కంపెనీలు, వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో కేంద్రం యాప్ తప్పనిసరి కాదంటూ వెనక్కి తగ్గింది. ఈ గొడవ అలా తగ్గిందో లేదో మళ్లీ వెంటనే కొత్త ప్రతిపాదనను సమీక్షిస్తోంది. వాస్తవానికి నేడు దీనిపై ఢిల్లీలో మొబైల్ తయారీ కంపెనీలతో సమావేశం జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
GPS ప్రతిపక్షాలకు మరో ఆయుధం?:
ప్రతి మొబైల్‌లో జీపీఎస్ తప్పనిసరి చేయాలన్న కేంద్రం టెలికాం శాఖ ప్రతిపాదన ప్రతిపక్షాలకు మరో ఆయుధం ఇచ్చినట్లే. ఇప్పటికే సంచార్ సాథీ యాప్ ద్వారా ప్రజలపై కేంద్రం నిఘా పెట్టాలనుకుంటోందని, ఇది రాజ్యాంగం ఇచ్చిన గోప్యతకు భంగం కలిస్తోందని ప్రతిపక్షాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌పై వెనక్కి తగ్గినట్లే తగ్గి మళ్లీ జీపీఎస్ ప్రతిపాదనతో కేంద్రం ముందుకు రావడం ప్రతిపక్షాలకు మరో ఆయుధం ఇచ్చినట్లే. నిజానికి జీపీఎస్ ఇన్‌బిల్ట్‌గా ఆన్‌లో ఉంటే ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎక్కడ ఉన్నారు? అనే విషయం ప్రభుత్వానికి సులభంగా తెలిసిపోతుంది. ఇది ఒకరకంగా తమ మీద నిఘానేని ప్రజలు కూడా భావించే అవకాశం లేకపోలేదు.
Read Also: వాళ్లతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కోవడమే: రవిశాస్త్రి
Follow Us On: Pinterest


