Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం పర్యటన: అభివృద్ధి పనులకు శ్రీకారం

కలం, మెదక్​ బ్యూరో​ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ రోజు సాయంత్రం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం 775.72 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. ముఖ్యంగా నంగునూరు మండలం నర్మెట్టలో 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించనున్నారు. దీనితో పాటు సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో 475.72 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

పర్యటనలో భాగంగా పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన రైతు మేళా ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పరిశీలిస్తారు. అనంతరం నర్మెట్టలో సుమారు 30 వేల మంది రైతులతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇదే వేదిక నుండి తెలంగాణ రైతాంగం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన నిమిత్తం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం, సాయంత్రం 4 గంటలకు నర్మెట్టలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభలో పాల్గొంటారు.

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వివరాలు..

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి నేడు ప్రారంభించనున్నారు. అదేవిధంగా సిద్దిపేట మున్సిపాలిటీలో 141.34 కోట్ల రూపాయలతో నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్సాన్‌పల్లిలో 78 కోట్ల రూపాయలతో జిల్లా జైలు భవనం, 15 కోట్ల రూపాయలతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి, 3.60 కోట్ల రూపాయలతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌ను ప్రారంభించనున్నారు. వీటితో పాటు గట్లమల్యాలలో రూ.1.43 కోట్లతో పీహెచ్​సీ, అంబేద్కర్ నగర్‌లో రూ.1.43 కోట్లతో యూపీహెచ్‌సీ భవనాలను ఆవిష్కరించనున్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో కొండపాకలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మర్కూక్‌లోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో 16.62 కోట్ల రూపాయలతో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు భూమిపూజ నిర్వహించనున్నారు. మర్కూక్ లో 8.65 కోట్లతో, జగదేవ్‌పూర్‌లో 9.65 కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయాలను (IOC) ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>