Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం

కలం, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శుక్రవారమే కొండపైకి చేరుకున్న వారు గాయత్రీ నిలయం అతిథిగృహంలో బస చేసి.. ఈ ఉదయం శ్రీనివాసుడిని దర్శనం చేసుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం కుటుంబ సభ్యులకు టీటీడీ ఈవో రవి చంద్ర (TTD EO Ravi Chandra), అర్చకులు ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో చంద్రబాబు కుటుంబానికి పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు.

దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్నవితరణకు విరాళం అందజేశారు. ఒక్కరోజుకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు (SV Annaprasadam Trust)కు విరాళం ఇచ్చారు. అనంతరం అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు సీఎంతో పాటు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, లోకేష్‌, దేవాన్ష్‌ అన్నవితరణ చేశారు. భక్తులకు వడ్డించాక చంద్రబాబు కుటుంబం అన్నప్రసాదం స్వీకరించారు. దేవాన్ష్‌ పుట్టినరోజుకు ఏటా విరాళం అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం ఉ. 10 గం.కు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సీఎం చేరుకోనున్నారు. ఉదయం 10.45 గం.కు టీటీడీ వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌, స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు తిరుమల నుంచి సీఎం తిరుగుపయనమవుతారు.

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 57,272 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>