దేశవ్యాప్తంగా హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన విలువైన డేటాను హ్యాక్ చేస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో హ్యాకర్లు ఏకంగా తెలంగాణ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్లు (Telangana Police Commissionerate websites) హ్యాక్ చేసేశారు. ఆయా డిపార్ట్‌మెంట్ పోలీసుల సైట్లు హ్యాక్ కావడంతో.. సైట్‌లోని లింక్‌లు ఓపెన్ చేస్తుంటే బెట్టింగ్ సైట్‌లకు రీడైరెక్ట్ అవుతున్నాయి. దీంతో హ్యాకర్లకు చెక్ పెట్టేందుకు ఐటీ విభాగం సర్వర్లు డౌన్ చేసింది. ప్రభుత్వ వెబ్ సైట్లకు సంబంధించిన పాస్ వర్డ్ వ్యవస్థను వెంటనే తొలగించాలని ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సైట్లు తరుచుగా హ్యాకింగ్ కి గురి అవుతుండటంతో సైబర్ క్రైమ్ పోలీసులు హ్యాకింగ్ ముఠాలపై దృష్టి సారించారు. వెంటనే రంగంలోకి దిగి లోతైన విచారణ ప్రారంభించారు.
రెండు సైట్‌లను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని తెలంగాణ పోలీస్ వర్గాలు (Telangana Police) తెలిపాయి. పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లు ఓపెన్ చేస్తే బెట్టింగ్ పోర్టల్‌కు రీడైరెక్ట్ అయ్యేలా దారి మళ్లించారు. దీంతో పోలీస్ విభాగం బెట్టింగ్ పేజీలోకి వెళ్లకుండా చూసుకోవడానికి సైట్‌లను ఆఫ్‌లైన్ మోడ్‌లో పెట్టేసింది. కాగా NIC నిర్వహించే హైకోర్టు వెబ్‌సైట్ నవంబర్ 13న హ్యాక్ అయ్యింది. ఈ ఘటనపై బిఎన్‌ఎస్, ఐటి చట్టం, గేమింగ్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే హ్యాకింగ్ కారణంగా పోలీసులే కాదు.. సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ వెబ్‌సైట్ల హ్యాకింగ్ బెడద కారణంగా పది రోజులుగా సైబరాబాద్, రాచకొండ వెబ్‌సైట్లు పనిచేయడం లేదు. సామాన్య ప్రజలకు కీలక సమాచారాన్ని అందించే ఈ వెబ్‌సైట్లలో ఫిర్యాదుల నమోదు, ట్రాఫిక్ చలాన్లు, అత్యవసర సంప్రదింపు వివరాలు, ప్రజల కోసం రూపొందించిన వివిధ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ సైట్లను ఓపెన్ చేస్తే, అందులోని లింకులు అనూహ్యంగా ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లు, అనుమానాస్పద గేమింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదని, ప్రణాళికాబద్ధమైన సైబర్ దాడి అని పోలీసు విభాగాలు భావిస్తున్నాయి.
Read Also: ‘హిల్ట్’ను అడ్డుకొని తీరుతాం: కేటీఆర్
Follow Us on: Facebook


