Central Funds | రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండగా ఇటీవలే వాటికి మోక్షం లభించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పద్దుల కింద రావాల్సిన నిధులతో పాటు ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రామాభివృద్ధి కోసం విడుదల కావాల్సిన నిధులు కూడా వేర్వేరు కారణాలతో ఇంతకాలం ఆగిపోయాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక అవసరాలు, ప్రత్యేక పరిస్థితిగా భావించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరింది. దీనికి సానుకూల స్పందన రావడంతో అన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా రావాల్సిన బకాయిలను ఒకేసారి సుమారు రూ. 1200 కోట్ల మేర విడుదల చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ నిధులతో పంచాయతీ కార్యదర్శుల వేతనాలు సహా గ్రామాభివృద్ధికి అవసరమైన చిక్కులు తొలగిపోనున్నాయి. మరోవైపు రానున్న ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన నిధులను కూడా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే కేంద్ర నిధులు (Central Funds) ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు గుర్తుచేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే 15వ ఆర్థిక సంఘం నుంచి కూడా నిధులు రిలీజ్ కానున్నట్లు తెలిపాయి. ఈ రూపంలో దాదాపు రూ. 3 వేల కోట్లు రానున్నాయి.
Read Also: GHMC లోకి 27 అర్బన్ మున్సిపల్ బాడీలు
Follow Us On: WhatsApp


