ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హుస్నాబాద్(Husnabad)లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 44.12 కోట్ల అంచనా వ్యయంతో హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. రూ. 58.91 కోట్ల అంచనా వ్యయంతో హుస్నాబాద్ టు అక్కన్నపేట వరకు 4 లేన్ హమ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. రూ. 20 కోట్ల వ్యయంతో హుస్నాబాద్ మున్సిపాలిటీ పలు అభివృధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకొనేందుకు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. మందు, మద్యానికి ఆశపడి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు అమ్ముకోవద్దని సూచించారు. గ్రామాభివృద్ధికి నిధులు తీసుకొచ్చే సత్తా ఉన్నోళ్లనే ఎన్నుకోవాలని సూచించారు. త్వరలోనే గౌరెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో వివక్ష చూపించిందని ఆరోపించారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని.. కానీ, గౌరెల్లి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తమ గౌరెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని హామీ ఇచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ హుస్నాబాద్ నుంచే బహుజన దండు కట్టారని రేవంత్ రెడ్డి(Revanth Reddy)గుర్తు చేశారు.
కేసీఆర్(KCR) పాలనలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram) కూలిపోతే .. కాంగ్రెస్ పాలనలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటివరకు చెక్కు చెదరకుండా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో అన్ని విషయాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
Read Also: రెండేళ్లలో 61,379 ఉద్యోగాల భర్తీ
Follow Us On: WhatsApp


