తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కేసు చిత్రపురి కాలనీ అక్రమాల కేసు (Chitrapuri Colony Case). ఈ కేసుపై విచారణ పూర్తి అయింది. 2005 నుంచి 2020 దాకా జరిగిన అవకతవకలపై కమిటీ విచారించింది. దీనిపై నవంబర్ 27న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేసింది. ఈ అక్రమాలకు 15 మంది బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్టులో తెలిపింది. పాత, ప్రస్తుత కమిటీ సభ్యులు ఇందులో ఉన్నట్టు స్పష్టం చేసింది. గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఫైనల్ రిపోర్టు కాపీని సదరు 15 మందికి పంపించారు.
ఈ 15 మందిలో సినీ పెద్దలు కూడా ఉన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్ పేర్లు ఉన్నాయి. బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్‌తో పాటు ఇంకొందరు ఇందులో ఉన్నారు. రూ.43.78 కోట్లు రికవరీ చేయాలని ఫైనల్ రిపోర్ట్ లో తెలిపింది కమిటీ. అదనంగా 18శాతం చెల్లించాలని ఇందులో ఆదేశించింది. దీంతో సినీ పెద్దల పేర్లు మార్మోగిపోతున్నాయి. మరి వారేమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.
Chitrapuri Colony Case | చిత్రపురి కాలనీ కేసు ఏంటి..?
మణికొండలోని సర్వే నం.246/1లో 67.16 ఎకరాల స్థలాన్ని గతంలో సినీ కార్మికులకు ప్రభుత్వం కేటాయించింది. దీనికి 2002లో సభ్యత్వాన్ని స్టార్ట్ చేశారు. మూడు విభాగాల్లో ఇళ్లు నిర్మించాలని ప్లాన్ చేశారు. సొసైటీ సభ్యులకు ఫ్లాట్లు కేటాయించాలంటే రంగారెడ్డి కలెక్టర్, సహకార శాఖ, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్లు, ఇద్దరు సినీ ప్రముఖులతో కూడిన కమిటీ సంతకాలుండాలి. 2015 వరకు 4213 ప్లాట్లు రెడీ అయ్యాయి. కానీ అప్పటికి భూముల ధరకు రెక్కలు రావడంతో కమిటీ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి అక్రమాలకు తెరలేపారు. పెద్ద ఎత్తున లంచాలు తీసుకుని అనర్హులకు ప్లాట్లను కేటాయించారు. 4213 ఫ్లాట్లు ఉంటే 9153 మందిని సొసైటీలో సభ్యులుగా చేర్పించి డబ్బులు తీసుకున్నారు. ప్లాట్లు అర్హులకు రాకపోవడంతో కేసులు నమోదై ఈ కుంభకోణం బయటపడింది.


