సంచార్ సాథీ (Sanchar Saathi) యాప్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే ఈ యాప్ డౌన్‌లోడ్లు అనూహ్యంగా పెరిగాయి. ఈ మేరకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. సాధారణంగా ఈ యాప్ రోజుకు 60వేల డౌన్‌లోడ్లు జరుగుతుండగా, నిన్న మాత్రం 6లక్షలకు చేరినట్లు పేర్కొంది. అంటే ఒక్కరోజులోనే పదిరెట్ల డౌన్‌లోడ్లు పెరిగాయి. కాగా, ప్రజలకు సైబర్ సెక్యూరిటీ, సేఫ్టీ కోసం ఈ యాప్‌ను తీసుకొచ్చామని ఎన్‌డీఏ చెబుతుండగా, ఈ యాప్‌ను మొబైల్‌లో తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలనే నిర్ణయం ప్రజల గోప్యతకు భంగం కలిగించడమేనని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఒక వర్గం పారిశ్రామిక విశ్లేషకులు సైతం ఈ యాప్‌ను తప్పనిసరి చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే మంగళవారం పార్లమెంట్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. వాస్తవానికి, ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఇన్‌బిల్ట్‌గా ఈ యాప్‌ను ఉంచాలని మొదట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబర్ సెక్యూరిటీ, సేఫ్టీకి ఇది ఉపయోగపడుతుందని చెప్పింది. అయితే, దీనికోసం వినియోగదారుడి వివరాలతోపాటు ఫోన్‌లో కాల్స్, మెసేజ్‌లు, ఫొటోలు వంటి వాటినీ తెలుసుకునేలా యాప్‌లో అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రజలపై నిఘా పెట్టేందుకే ఈ యాప్‌ను ఎన్‌డీఏ ప్రభుత్వం తప్పనిసరి చేసిందని, ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు విమర్శించాయి.
మరోవైపు మొబైల్ తయారీ కంపెనీ ఐఫోన్ సైతం ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము మాత్రం సంచార్ సాథీ (Sanchar Saathi) యాప్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇవ్వబోమని చెప్పింది. ప్రతిపక్షాలు, పరిశ్రమ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ యాప్‌ను వినియోగదారుడు సైలెంట్‌లో పెట్టొచ్చునని, అవసరం లేదనుకుంటే తొలగించవచ్చని చెప్పింది. ఈ వివాదం ఇలా జరుగుతుండగా, ఒక్కసారిగా యాప్ డౌన్‌లోడ్ల సంఖ్య పదిరెట్లు పెరగడం విశేషం. కాగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఈ యాప్‌ను కోటీ 50లక్షల మందికి పైగా వాడుతున్నారు.
Read Also: అర్బన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్‌లపై కేంద్రం క్లారిటీ
Follow Us on: Facebook


