తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫార్మేషన్ పాలసీ (Hilt Policy) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ పాలసీకి రూపకల్పన చేస్తున్న దశలోనే లీక్ అయ్యింది. ప్రభుత్వం ఈ పాలసీకి సంబంధించిన నవంబర్ 22న జీవో విడుదల చేస్తే… అంతకంటే ఒక్కరోజు ముందుగానే కేటీఆర్ (KTR) మీడియా ముందుకొచ్చి ఈ పాలసీ గురించి ప్రస్తావించారు. ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. హిల్ట్ పాలసీ పేరుతో భారీ అవినీతికి తెరలేపారని కేటీఆర్ విమర్శించారు. 5 లక్షల భూకుంభకోణం ఉందని కూడా ఆయన విమర్శించారు. తక్కువ ధరకే భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టబోతున్నారని ఆరోపించారు. ఆ వెంటనే బీజేపీ కూడా విమర్శలు స్టార్ట్ చేసింది. ఏకంగా గవర్నర్‌కే ఫిర్యాదు చేసింది. అయితే ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన జీవోను బయటకు తీసుకురాకముందే ఎలా బయటకు వచ్చింది? లీక్ చేసింది ఎవరు? అన్న చర్చ మొదలైంది?
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం ఈ అంశంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందే లీక్ చేయడం సరికాదని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా ప్రభుత్వం ఈ లీకేజీపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయబోతున్నది. నవంబర్ 20నే హిల్ట్ పాలసీ(Hilt Policy)కి సంబంధించిన ఫోటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చినట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారని.. బీఆర్ఎస్ పాలనలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉన్నతాధికారులు ప్రస్తుతం కీలకపోస్టుల్లో ఉన్నారు. వారే ఈ కీలక సమాచారాన్ని బయటపెట్టి ఉంటారని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. తాజాగా విజిలెన్స్ ఎంక్వైరీ వేసి అటువంటి అధికారులు ఎవరో కనిపెట్టనున్నారు.


