కలం డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు గుదిబండగా మారింది. గత సర్కారు చేసిన అప్పులను క్రమం తప్పకుండా ప్రతి నెలా వడ్డీతో సహా వాయిదాలను (Instalments) చెల్లించడం ప్రస్తుత ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో మూడు నెలలుగా వాయిదాలు చెల్లించలేదు. బకాయిలను చెల్లించకుంటే ఎన్‌పీఏ (NPA – నిరర్ధక ఆస్తులు)గా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) లేఖ రాసింది. ఎన్‌పీఏ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. భవిష్యత్తులో రుణం పుట్టడానికి చిక్కులు తలెత్తుతాయి. దీంతో సర్దుబాటు చేసి వాయిదాలను చెల్లించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను మరమ్మత్తు చేయాలని భావించిన సర్కారు.. టెండర్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి కూడా నిధులను సమకూర్చాల్సి వస్తున్నది. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి ప్రభుత్వానికి తలనొప్పి తీసుకొచ్చింది.
గతంలోనూ ఆర్ఈసీ ఘాటు లేఖలు :
కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టు కోసం ఆర్ఈసీ నుంచి తెలంగాణ ప్రభుత్వ గ్యారంటీతో కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలు రూ. 30,536 కోట్ల మేర రుణం మంజూరైంది. ఇంధులో రూ. 28,995 కోట్లు విడుదలైంది. అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం క్వార్టర్లీ పేమెంట్ చేయాల్సి ఉన్నా నిధుల కొరత కారణంగా దాదాపు రెండున్నర నెలల కాలం ఆలస్యమవుతున్నది. దీంతో లేట్ పేమెంట్ పెనాల్టీ, అదనపు వడ్డీ విధించాల్సి వస్తుందని పేర్కొన్న ఆర్ఈసీ… దీన్ని నివారించడానికి సకాలంలో చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. గతేడాది నవంబరులో ఒకసారి, ఈ ఏడాది జూన్‌లో మరోసారి ఘాటుగానే లేఖలు రాసి ‘దివాలా’ జాబితాలో చేరుస్తామని హెచ్చరించింది. తాజాగా నవంబరు నెలలోనూ అదే తరహాలో హెచ్చరించింది. దీంతో సర్కారు డైలమాలో పడింది. పేమెంట్ కోసం ఇరిగేషన్ డిపార్టుమెంటు పడరాని పాట్లు పడుతున్నది.
రుణాల రీషెడ్యూలు ప్రయత్నాలు :
రుణాలు తీసుకున్న సమయంలో కాళేశ్వరం కార్పొరేషన్‌కు, ఆర్ఈసీకి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అప్పుగా తీసుకున్న మొత్తం (రూ. 28,995 కోట్లు)లో 71 శాతాన్ని 2029–30 నాటికి, మిగిలిన 29 శాతాన్ని 2035 నాటికి చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుండడంతో రుణాల రీపేమెంట్ క్యాలెండర్‌ను మార్చాలని, రీషెడ్యూలు చేయాలని రాష్ట్ర సర్కారు నుంచి ఆర్ఈసీకి లేఖ వెళ్ళింది. గత ఒప్పందానికి భిన్నంగా కొత్త ప్రతిపాదనలు చేసింది. తీసుకున్న రుణంలో 2030 సంవత్సరం నాటికి 9%, 2035 నాటికి 18%, 2036 నాటికి 27%, 2040 నాటికి 46% చొప్పున చెల్లించేలా మార్పులు చేయాలని విజ్ఞప్తి చేసింది. కానీ అది కుదరదంటూ ఆర్ఈసీ గతేడాది నవంబర్ 5న రాసిన లేఖలోనే స్పష్టం చేసింది. ఈ వివాదం కొలిక్కి రాకముందే తాజా క్వార్టర్‌కు చెల్లింపులు చేయకపోవడంతో మరోసారి ‘దివాలా’ వార్నింగ్ తప్పలేదు. ఏకకాలంలో ఆర్ఈసీకి వడ్డీతో సహా వాయిదాల చెల్లింపు, మూడు బ్యారేజీల రిపేర్ పనులు తలకు మించిన భారంగా మారుతున్నాయి.
Read Also: కరిచేవాళ్ళు పార్లమెటు లోపల ఉన్నారు.. వివాదంగా రేణుకా చౌదరి కామెంట్స్
Follow Us On: X(Twitter)


