తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల(Cotton Procurement)పై గత కొన్ని రోజులుగా అనిశ్చితి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ అనిశ్చితికి తాజాగా బ్రేక్ పడింది. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) తీసుకొచ్చిన కొన్ని కొత్త నిబంధనలను వ్యతిరేకించడంతో కొనుగోళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. రైతులు పత్తి అమ్మేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు కూడా నిర్వహించారు.
ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) ఈ అంశంపై దృష్టిసారించారు. సమస్య పరిష్కారానికి సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా కేంద్ర మంత్రులతో పాటు సీసీఐ సీఎండీతో కూడా మంత్రి నేరుగా మాట్లాడి, జిన్నింగ్ మిల్లుల అభ్యంతరాలను వివరించారు.
మిల్లుల పనితీరుకు ఇబ్బందిగా ఉన్న నిబంధనల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో సీసీఐ సానుకూలంగా స్పందించింది. చివరికి నిబంధనల సడలింపులకు సీసీఐ అంగీకరించడంతో కొనుగోళ్ల పునఃప్రారంభానికి మార్గం సుగమమైంది.
రాష్ట్రవ్యాప్తంగా నోటిఫై చేసిన 330 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు(Cotton Procurement) త్వరలోనే పూర్తి స్థాయిలో పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు సీసీఐ రాష్ట్రంలో మొత్తం 3.66 లక్షల టన్నుల పత్తిని సేకరించినట్లు అధికారులు తెలిపారు. రైతుల వద్ద ఇంకా నిల్వగా ఉన్న పత్తిని పూర్తిగా కొనుగోలు చేసేలా సీసీఐ, జిన్నింగ్ మిల్లులు సమన్వయంతో పనిచేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Read Also: మేడారం ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష
Follow Us On: X(Twitter)


