కలం డెస్క్ : బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కొత్త పార్టీ ఏర్పాటుపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. లండన్ లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కొత్త పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. అని ప్రకటించారు. ఆమె కొత్త పార్టీ పెడితే క్లిక్ అవుతారా? గతంలో పెట్టినవారే అడ్రస్ లేకుండా పోయారు. లిక్కర్ స్కామ్ మచ్చ పడిన ఆమెను ప్రజలు ఆదరిస్తారా? ఇలాంటి చర్చలు చాలా కాలంగా జరుగుతున్నాయి. గతంలో దేవేందర్ గౌడ్ (నవ తెలంగాణ పార్టీ), జయప్రకాశ్ నారాయణ (లోక్ సత్తా పార్టీ), డాక్టర్ చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ), చిరంజీవి (ప్రజారాజ్యం).. ఇలాంటివారు పార్టీలు పెట్టినా వాటిని నడపలేకపోయారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడితే ఆ జాబితాలో చేరక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.
కొత్త పార్టీపై సందిగ్ధం :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ ఏర్పడిన తర్వాత పుట్టిన పార్టీలు సక్సెస్ కాలేకపోయాయి. కేంద్ర ఎన్నికల సంఘం సైతం కొన్నింటి గుర్తింపును ఇటీవలే రద్దు చేసింది. తాజాగా తీన్మార్ మల్లన్న సైతం బీసీ ఓటర్లే లక్ష్యంగా కొత్త రాజకీయీ పార్టీని పెట్టారు. కొత్త పార్టీపై నిర్ణయం తీసుకోలేదు.. అంటూ ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టే ఉద్దేశాన్ని మాత్రం వెల్లడించలేదు. బీఆర్ఎస్ విధించిన సస్పెన్షన్ ను తిరిగి ఎత్తివేస్తే మళ్ళీ చేరడానికి ఆమె సిద్ధంగా ఉన్నారా?.. అలాంటి పరిణామమే ఎదురైతే ‘దయ్యాలు’ అంటూ పేర్కొన్న వ్యక్తుల్ని తొలగించాల్సిందేనని పట్టుబడతారా?.. బావ హరీశ్ రావుపై సీరియస్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ప్రభావాన్ని తగ్గించాలనే డిమాండ్ పెడతారా?.. ఇలాంటివన్నీ ప్రజల మధ్య చర్చనీయాంశాలుగా ఉన్నాయి.
కవిత వెంట నడిచేదెవ్వరు? :
కొత్త పార్టీని పెట్టేందుకు కల్వకుంట్ల కవిత సాహసిస్తారా? పెట్టిన తర్వాత ఆమె వెనక నడిచేదెవ్వరు?.. బీఆర్ఎస్ నుంచి వచ్చేవారు ఉంటారా? ఒకవైపు కేసీఆర్ పేరును జపిస్తూనే ఆయన అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి వ్యతిరేకంగా రోడ్ మ్యాప్ రూపొందించే ధైర్యం చేస్తారా? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను కాదని కవిత కొత్త పార్టీవైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఆమె పార్టీ పెడితే ఇమేజ్ పెరుగుతుందా? లేక గ్రాఫ్ మరింత డౌన్ అవుతుందా? ఇలాంటి అంశాలు కీలకంగా మారాయి. ఫెయిల్యూర్ లీడర్ ముద్ర పడకుండా కొత్త పార్టీ విషయంలో ఆమె ఆచితూచి అడుగేయనున్నారు. అందుకే పార్టీ పెట్టడంపై ఔను.. కాదు.. అంటూ స్పష్టత ఇవ్వడంలేదు.
అన్నా చెల్లెళ్ళ కేసీఆర్ రాగం :
బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్, ఆ పార్టీ నుంచి ఈ మధ్యనే గెంటివేతకు గురైన కల్వకుంట్ల కవిత.. ఈ ఇద్దరూ సొంత అన్నా చెల్లెళ్ళు. కేసీఆర్ రాగాన్నే ఆలపిస్తున్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు.. ఆయనే ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష.. ప్రజలకు, రాష్ట్రానికి భవిష్యత్తు ఆయనతోనే సాధ్యం… ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో లేకపోయినా కన్నతండ్రిగా కేసీఆర్ పేరును కవిత జపిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున కేటీఆర్ సైతం కేసీఆర్ పేరునే వల్లె వేస్తున్నారు. ఇద్దరూ రాజకీయంగా భిన్న ధృవాలుగా ఉన్నా వారిద్దరి ఆరాధ్య దైవం కేసీఆరే. వీరిద్దరి రాజకీయ భవిష్యత్తుకు కేసీఆర్ ఇమేజే ఆధారం.

