కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా ధృవీకరించింది. టెహ్రాన్‌లో అత్యంత వ్యూహాత్మక రీతిలో జరిగిన భారీ బాంబు దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా మరణించినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనతో ఇరాన్ మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఖమేనీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రభుత్వం, దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించింది.
ఇరానియన్ల సంబురాలు..
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణ వార్త వెలువడటంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. టెహ్రాన్ వీధుల్లో ప్రజలు గుమిగూడి హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో ఇరానియన్లు భారీగా తరలివచ్చి విజయోత్సవాలు నిర్వహించారు.
న్యాయం జరిగింది.. ట్రంప్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ (Ali Khamenei) మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖమేనీని చరిత్రలోనే అత్యంత దుర్మార్గుడిగా అభివర్ణించిన ట్రంప్, ఆయన మరణం ఇరాన్ ప్రజలతో పాటు అమెరికన్లకు, ప్రపంచవ్యాప్తంగా బాధితులకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇంటెలిజెన్స్, ట్రాకింగ్ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడం వల్లే ఖమేనీని ఇతర నేతలను అంతం చేయడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు.
ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమని, అక్కడి భద్రతా బలగాలు పోరాటాన్ని విరమించి ఇమ్యూనిటీ కోరుతున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం అవసరమైన చోట బాంబింగ్ కొనసాగుతుందని, ప్రపంచవ్యాప్తంగా శాంతిని తీసుకురావడమే తమ లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.

