కలం, వెబ్ డెస్క్: దేశానికి సేవ చేస్తూ, దివ్యాంగులైన సైనికులకు ఇచ్చే పెన్షన్‌పై కేంద్రం టాక్స్ విధించడం అవమానకరమని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. జవాన్ల త్యాగాలను, సేవలను గౌరవించాలని.. వాళ్లకు ఇస్తున్న దివ్యాంగ పెన్షన్‌పై పన్ను తీసివేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సాయుధ దళాలకు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు రూపొందించిన ఈసీహెచ్ఎస్ పథకానికి తగిన నిధులు కేటాయించాని కోరారు. ప్రస్తుతం ఈ పథకానికి తీవ్ర నిధుల కొరత ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు శనివారం ఆయన ఓ లేఖ రాశారు. ఇటీవల మాజీ సైనికులు తనను కలసి, ప్రస్తావించిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
‘ఈసీహెచ్ఎస్కు(ECHS) సంబంధించి రూ.12వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కారణం.. ఈ పథకానికి అవసరమైన నిధుల కంటే దాదాపు 30 శాతం తక్కువగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. చెల్లింపులు ఆలస్యమవడంతో అనేక ఆసుపత్రులు సేవల నుంచి తప్పుకుంటున్నాయి. మాజీ సైనికులు తమ ఖర్చుతో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సను కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దేశానికి సేవలందించిన వాళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపిస్తోంది’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
సైనికుల డిజేబిలీటీ పెన్షన్లపై టాక్స్ విధించే ప్రతిపాదనను కూడా రాహుల్ ప్రస్తావించారు. ‘ బ్రిటీష్ జమానాలోని 1922 తర్వాత మళ్లీ ఇలా దివ్యాంగ పెన్షన్లపై పన్ను విధిస్తున్నారు. గాయపడిన సైనికులకు ఉపశమనంగా ఇచ్చే ఈ పెన్షన్‌ను ఆదాయంగా చూడొద్దు. సైనికులు దేశానికి నిస్వార్థంగా సేవలందిస్తున్నారు. వాళ్లకు ఇచ్చే పెన్షన్‌పై పన్ను విధించడం అవమానకరం’ అని రాహుల్ ఆ లేఖలో వ్యాఖ్యానించారు. ఈ లేఖ కాపీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కూడా ఆయన (Rahul Gandhi) పంపించారు.
Read Also: నైటుకు రేటు ఎంత అని అడుగుతారా.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఫైర్!
Follow Us On: Instagram

