కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శుక్రవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు బయలుదేరి వెళ్లారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరపున బరిలో నిలవాలని ఆశిస్తున్న పలువురు ఆశావాహుల పేర్లను కేటీఆర్ ఈ సమావేశంలో కేసీఆర్ (KCR) ముందు ఉంచనున్నారు. రాజ్యసభ ఎన్నికల వ్యూహంతో పాటు, అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ భేటీలో సామాజిక సమీకరణలు, పార్టీకి ఉన్న బలాబలాల ఆధారంగా అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. కేసీఆర్‌తో భేటీ ముగిసిన వెంటనే, బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా తమ రాజ్యసభ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్ (BRS)కు కేంద్ర రాజకీయాల్లో ప్రాధాన్యం తగ్గింది. గతంలో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. జాతీయ స్థాయిలో దాని ప్రభావం దాదాపు శూన్యానికి చేరింది. తెలంగాణ ఆధారంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకున్న బీఆర్ఎస్‌కు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పెద్దల సభలోనైనా బీఆర్ఎస్ పట్టు సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

