కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో నిత్యావసర వస్తువుల కల్తీ ఉదంతాలు ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. పాలు, నూనె, కారం, పసుపు వంటి నిత్యం వాడే వస్తువుల నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు (Ginger, Garlic Paste) ప్రతిదీ కల్తీమయమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా గడువు ముగిసిన లైసెన్స్‌లతో, మురికి కూపాలను తలపించే ప్రాంతాల్లో హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు కలిపి వ్యాపారం సాగిస్తున్నారు. ఈ దందాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, కల్తీకి చెక్ పెడటం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టును ఖైరతాబాద్ (Khairatabad) జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు.
ఎం.ఎస్.మఖ్తా రైల్వే గేట్ సమీపంలోని ఒక అక్రమ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. JJ ఫుడ్స్ పేరుతో కల్తీ విక్రయాలు సాగిస్తున్న 21 ఏళ్ల జసాని ఇల్యాన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు గడువు ముగిసిన లైసెన్స్‌తో వ్యాపారం చేస్తున్నాడు. నాణ్యత లేని ముడి పదార్థాలతో తయారుచేసిన పేస్ట్‌ను నగరంలోని ప్రముఖ హోటల్స్, కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో సుమారు 4,000 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

