కలం, నిజామాబాద్ బ్యూరో: దెబ్బతిన్న నరాలకు ఆధునిక పద్ధతిలో శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నట్లు హైదారాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు పి. ప్రకాశ్ వెల్లడించారు. గురువారం నిజామాబాద్ (Nizamabad) ప్రెస్ క్లబ్లో మెడ, భుజాల గాయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యులు పి. ప్రకాశ్ మాట్లాడారు. చేతి నరాలు దెబ్బతినటానికి రకరకాల కారణాలుంటాయని, రోడ్డు ప్రమాదాలతో ఎక్కువగా గాయాలవుతుంటాయన్నారు. ముఖ్యంగా యువత కూడా నరాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.
ద్విచక్ర వాహనాలు నడిపేవాళ్లలో గాయాలు (Injuries) ఎక్కువగా జరుగుతుంటాయన్నారు. అలాంటివారికి చికిత్స అవగాహన లేకపోవడంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని అన్నారు. నరాల గాయాలైన వ్యక్తుల చేతిలో కదలికలు, స్పర్శ లేకుండాపోతుందన్నారు. సరైన సమయంలో ట్రీట్ మెంట్ తీసుకుంటే.. తమ పనులు తాము చేసుకోవచ్చునని తెలిపారు. ఆధునిక వైద్యంతో ఎలాంటి నరాల సమస్యనైనా నయం చేయొచ్చని ఆయన తెలిపారు.

