కలం, వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల్లో కురిసిన అకాల వర్షాలు మొక్కజొన్న పంటను తీవ్రంగా దెబ్బతీశాయని ఆమె అన్నారు. ముఖ్యంగా గింజపట్టే దశలో ఉన్న మొక్కజొన్న చేలు ఈదురుగాలుల ధాటికి నేలకొరగడంతో పాటు మొక్కలు విరిగిపోయాయని, దీనివల్ల రైతులు సర్వస్వం కోల్పోయారని పేర్కొన్నారు. పంట నష్టంతో ఆందోళనలో ఉన్న మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం వెంటనే స్పందించి నష్ట పరిహారం అందించాలని కోరారు. అలాగే రైతులు ఆరబోసిన పసుపు, ఎర్రజొన్నలు సైతం వర్షానికి తడిచిపోయాయని కవిత తెలిపారు. ఈ రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
మరోవైపు బోధన్ నియోజకవర్గంలో సుమారు 15 వేల ఎకరాల్లో శనగ పంట సాగు చేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదని, దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రాలేదని కవిత (Kavitha) తెలిపారు. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఈసారి కేవలం 5 నుంచి 8 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. పండిన పంటను కూడా మద్దతు ధర కంటే క్వింటాల్ కు 450 రూపాయల తక్కువకు కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని ఆమె తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరకు శనగలు కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కవిత డిమాండ్ చేశారు.

