కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లాలో భారీ స్కాలర్షిప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అక్కడ కాలేజీ ఉండదు. విద్యార్థులు ఉండరు. కానీ కాలేజీ ఉన్నట్లు విద్యార్థులు చదువుతున్నట్లు పక్కాగా రికార్డు సృష్టిస్తారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లను తెలివిగా వేరే వాళ్ల అకౌంట్లో జమయ్యేలా ప్లాన్ చేశారు. కొన్ని కాలేజీల్లో ఉచితంగా చదువుకుంటున్న విద్యార్థులు, దూరవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులను టార్గెట్ చేసుకకున్న ముఠా భారీగా డబ్బులు దండుకున్నది. ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న స్కాలర్ షిప్స్‌ను స్వాహా చేశారు. పేరులో ఒక అక్షరం తప్పుంటేనే గుర్తించి లావాదేవీలు నిలిపివేసే బ్యాంక్ అధికారులు విద్యార్థులకు సంబంధంలేని ఖాతాల్లో డబ్బులు క్రెడిట్ అవుతుంటే.. వాటిని డ్రా చేస్తుంటే ఏం చేస్తున్నారనేదే పెద్ద ప్రశ్న. వరంగల్‌కు చెందిన ఓ పార్టీ నేత కూతురు డబ్బులు దుండగులు స్వాహా చేయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో కొందరు అధికారుల హస్తం కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫేక్ అడ్మిషన్లు
వరంగల్‌కు చెందిన రాజకీయ నేత పంజాల శ్రీనివాస్ కూతురు పంజాల కోమల వరంగల్ కాకతీయ వర్సిటీలో ఎంబీఏ చదువుతున్నారు. ఆమెకు తెలియకుండానే, అసలు ఎలాంటి సంబంధం లేకుండానే సూర్యాపేటలోని ఒక కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్లో బీహెచ్ఎం అడ్మిషన్ సృష్టించారు. విద్యార్థిని ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్‌ను అక్రమంగా మార్చేసి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా డ్రా చేశారు. అంతేకాక కంప్యూటర్ మ్యాన్యువల్ ఓవర్రెడ్ ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని తుంగలో తొక్కి స్కాలర్ షిప్ దోచుకున్నారు.
ముఠా బాగోతం బయటపడిందిలా..
ఈ విషయాన్ని గ్రహించిన బాధితులు ఇదేలా సాధ్యమంటూ స్కాలర్ షిప్స్ నొక్కేసిన కళాశాలకు వెళ్దామని సూర్యాపేటకు బయలుదేరారు. అక్కడ వాళ్లు మరింత షాక్ తిన్నారు. అసలు అక్కడ ఆ పేరుతో కళాశాలనే లేదు. గూగుల్‌లో అడ్మిషన్ కావాలని ఆ కళాశాల ఫోన్ నంబర్‌తో ఒక అడ్రస్‌కు వెళ్లగా అక్కడ ఓ షట్టర్ మినహా కాలేజే లేదు. దీంతో బాధితులు అక్కడున్న వారిని ప్రశ్నించడంతో ఆ ముఠా బాగోతం బయట పడింది. బాధితులు వారిని గట్టిగా మందలించడంతో 24 గంటలు తమకు సమయం ఇవ్వాలని వేడుకున్నారని తెలుస్తోంది. 24 గంటల తర్వాత ఫోన్ చేస్తే అటువైపు నుంచి స్పందన లేదు. దీంతో ఇది స్కామ్ అని నిర్ధారించుకున్న బాధితులు దీని వెనక పెద్ద ముఠానే ఉండవచ్చని భావించి సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కళాశాలే లేదు : బాధితుడు శ్రీనివాస్
అసలు అక్కడ కళాశాల బిల్డింగ్ లేకుండా, విద్యార్థి హాజరులేకున్నా స్కాలర్షిప్ వస్తోంది. ఇందులో పక్కా సంక్షేమ అధికారుల పాత్ర ఉందని బాధితుడు శ్రీనివాస్ ఆరోపించారు. చాలా పెద్దఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు. జిల్లా సంక్షేమశాఖ అధికారుల అండదండలు మద్దతు లేకుండా ఇంత పెద్ద అవినీతి జరిగే అవకాశం లేదన్నారు. ఇలా ఎన్నేళ్లుగా ఎంతమంది విద్యార్థుల స్కాలర్స్ఫిప్స్ నొక్కేస్తున్నారోనని ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల లేకపోవడంతో పాటు ఒక షెల్ కంపెనీ పెట్టి విద్యార్థుల స్కాలర్షిప్లను అక్రమంగా తమ అకౌంట్లో వేసుకుంటున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. కళాశాల మేనేజ్మెంట్, వెల్ఫేర్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని శ్రీనివాస్ పేర్కొన్నారు.

