కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ హయాంలో డిసెంబర్లోనే రైతుబంధు జమ అయ్యేదని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం మార్చి వస్తున్నా రైతులకు భరోసా (Rythu Bharosa) ఇవ్వలేకపోతోందని కేటీఆర్ (KTR) మండిపడ్డారు. రైతులకు కనీసం యూరియా బస్తాలు అందించలేని ప్రభుత్వం, గాంధీ కుటుంబానికి మాత్రం రూ.1000 కోట్లు కట్టబెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తుకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, అక్రమంగా అధికారం దక్కించుకోవాలని మంత్రి వివేక్ (Minister Vivek) కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.3 కోట్లు ఆఫర్ చేసినా బీఆర్ఎస్ నాయకులు లొంగలేదని, అందుకే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) సహా పలువురు నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆయన కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో పోలీసుల తీరుపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని కేటీఆర్ (KTR) విమర్శించారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలీసులను బూతులు తిట్టినా, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ‘యూస్‌లెస్ ఫెలోస్’ అని దూషించినా చర్యలు ఉండవు. కానీ, బీఆర్ఎస్ నేతలపై మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారని దుయ్యబట్టారు. జనగామలో బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ చేయి పట్టుకుని కాంగ్రెస్ కౌన్సిలర్ లాగడం వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ హెచ్చరించారు.
Read Also: పట్టపగలు నడివీధిలో యువకుడిని కాల్చి చంపారు
Follow Us On: Youtube

