కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరు (Tandur) పట్టణంలో దారుణం చోటు చేసుకున్నది. మంత్రాలు చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం.. బాలరాజు అనే వ్యక్తి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తన ఆరోగ్య పరిస్థితి క్షీణించడానికి స్నేహితుడు సాయిలు చేసిన మంత్రాలు కారణమని అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ అనుమానం క్రమంగా పెరిగి చివరకు హత్యకు దారితీసింది.
ఇటీవల ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆగ్రహానికి లోనైన బాలరాజు చేతిలో ఉన్న కత్తితో సాయిలు మెడపై దాడి చేసి నరికి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలోనే సాయిలు మృతి చెందాడు.
హత్య అనంతరం కూడా నిందితుడు కత్తితో హంగామా సృష్టించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

