epaper
Monday, February 23, 2026
epaper

తెలంగాణ బడ్జెట్ సెషన్ ముహూర్తం ఫిక్స్

కలం, తెలంగాణ బ్యూరో : రాబోయే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మార్చి 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 30 వరకు మొత్తం పదిహేను రోజుల పాటు జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Sessions) మార్చి 16న ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాలపై రెండు సభల్లో విడివిడిగా చర్చ జరిగి తీర్మానాన్ని ఆమోదించే కార్యక్రమాలు జరుగుతాయి. మార్చి 20న ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి ‌శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజునే రంజాన్ రావడం, దానికి ముందు రోజు ఉగాది పండుగ ఉన్నందున బడ్జెట్ తేదీల్లో మార్పుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందా లేక షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి. రెండు మతాలకు చెందిన రెండు పండుగలు ప్రధానమైనవి కావడంతో ప్రభుత్వం షెడ్యూలులో ఎలాంటి మార్పులు చేస్తుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.

రాజ్యసభ పోలింగ్, పండుగల హడావిడి..

రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Telangana Budget Sessions) తేదీలను ఖరారు చేయడంపై చర్చించింది. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేసినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. అదే రోజున రాజ్యసభ రెండు స్థానాలకు పోలింగ్ కూడా జరగనున్నది. ఎమ్మెల్యేలు ఓటర్లుగా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఓటు వేయనున్నారు. అదే రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కూడా ఉండనున్నది. మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టేలా షెడ్యూలు దాదాపు ఖరారైంది. కానీ అదే రోజున రంజాన్ పండుగ వచ్చే అవకాశమున్నది (నెలవంక కనిపించే పరిస్థితికి అనుగుణంగా). దానికి ముందు రోజు ఉగాది పండుగ. బడ్జెట్ సెషన్ జరిగే టైమ్‌లోనే మార్చి 27న శ్రీరామ నవమి పండుగ రానున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ద్రవ్య వినిమయ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31కల్లా అసెంబ్లీ, శాసనసభ ఆమోదం పొందాల్సి ఉన్నది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాల షెడ్యూలు చర్చకు దారితీసింది.

Read Also: జిల్లాల్లో కాంగ్రెస్ జెండా.. క్యాబినెట్ మరో బిగ్ డెసిషన్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>