epaper
Monday, December 1, 2025
epaper

కాపలాదారే కన్నం వేయబోయాడు.. జూబ్లీహిల్స్‌లో కలకలం..

ఇంటి దొంగను ఈశ్వరుడయినా పట్టలేడని తెలుగులో ఒక నానుడి ఉంది. అటువంటి ఘటనే తాజాగా జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో చోటు చేసుకుంది. ఉద్యోగం ఇచ్చిన యజమాని ఇంట్లోనే ఓ కాపలాదారు కన్నం వేయాలని ప్లాన్ చేశాడు. చాలా రోజులుగా ప్లాన్ చేసి.. తన సహచరులతో కలిసి శనివారం ప్లాన్‌ను అమల్లో పెట్టాడు. యజమానిని, డ్రైవర్‌ను తాళ్లతో కట్టేసి కత్తులతో దాడి చేశాడు. కానీ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసించే అజయ్ అగర్వాల్ ఇంట్లో శనివారం అర్ధరాత్రి సంచలన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చాలాకాలంగా ఆ ఇంటికి కాపలాదారుడిగా పనిచేస్తున్న రాధాచంద్‌ (40) మరో ఐదుగురితో కలిసి దోపిడీకి పెద్ద పథకం రూపొందించినట్టు పోలీసులు తెలిపారు.

రాధాచంద్ సహచరులతో కలిసి కత్తులు, తాళ్లతో అర్ధరాత్రి అజయ్ అగర్వాల్ ఇంటికి చేరుకుని ముందుగా అక్కడ ఉన్న డ్రైవర్‌ను తాళ్లతో కట్టేసి కత్తులతో దాడి చేశారని సమాచారం. అనంతరం కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దోచుకునేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ఇంట్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతున్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జూబ్లీహిల్స్(Jubilee Hills) పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి కాల్ అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దోపిడీ యత్నాన్ని అడ్డుకున్నారు. రాధాచంద్‌తో పాటు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగిలించడానికి ఉపయోగించిన కత్తులు, తాళ్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Read Also: ఏడుగురు నాయకులపై కాంగ్రెస్ వేటు..

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>