కలం డెస్క్ : జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) పేరుతో వినియోగదారులపై ఎడాపెడా పన్నులు వేసి 2017 నుంచి ఇప్పటివరకూ వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా 2.0 పేరుతో అనేక వస్తువులపై పన్ను శాతాన్ని తగ్గించింది. దీన్ని సామాన్యులకు మేలు.. ఊరట.. అంటూ గొప్పలు చెప్పుకుంటున్నది. పసిపిల్లలు తాగే పాలు మొదలు నిత్యం వాడే పెరుగు, బటర్… తదితర అనేక రకాల పాల ఉత్పత్తులపై పన్నులు వేసి వేల కోట్ల రూపాయలను ఆర్జించింది. తాజా పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు తగ్గి ప్రమాదం ముంచుకొస్తున్నదని గ్రహించి బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీఎస్టీ 2.0 సంస్కరణల పేరుతో దాదాపు 450కు పైగా వస్తువులపై పన్నును తగ్గించింది. నాడు వాతలు పెట్టి ఇప్పుడు తగ్గింపు పేరుతో ఉపశమనం కల్గించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నది.
తొడపాశం పెట్టి.. :
పిల్లలను గిల్లి తొడపాశం పెట్టి ఆ నొప్పి నుంచి రిలీఫ్ పొందేలా వారిని అక్కున చేర్చుకున్న చందంగా ఇప్పుడు జీఎస్టీ విషయంలోనూ బీజేపీ ఇదే విధానాన్ని అవలంబిస్తున్నది. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చిన కొత్తలో ఎడాపెడా పన్నులు బాదినప్పుడు సామాన్యులు పడరాని బాధలు పడ్డారు. ప్రతీ వస్తువుపైనా కేంద్రం ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేస్తున్నదని వాపోయారు. ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉన్నదో 2019, 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ చవిచూసింది. ఏదో తేడా కొడుతున్నదని, కాళ్ళకింద నేల కదులుతున్నదని రియలైజ్ అయింది. మళ్ళీ ఓటర్లను ప్రసన్నం చేసుకుని బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడకూడదని, మళ్ళీ పార్లమెంటు ఎన్నికల్లో అధికారం చేజార్చుకోవద్దని జీఎస్టీ 2.0 పేరుతో పన్నులను తగ్గించడం, లేదా కొన్నింటిపై ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది.
ఇప్పటివరకు వసూలు చేసిన సంగతేంది?
జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా సామాన్యులకు ఉపశమనం కలిగించామని గొప్పగా చెప్పుకున్నా.. 2017 నుంచి 8 ఏండ్ల పాటు వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయల సంగతేంటనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. తాజా సంస్కరణల ద్వారా కేంద్రానికి ఏటా సుమారు రెండున్నర లక్షల కోట్ల కొరత ఏర్పడుతుందని ఓ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. అంటే ఇంతకాలం ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసిందని పరోక్షంగా చెప్పినట్లయింది. మిడిల్ క్లాస్ వర్గాలకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు కలిగించేలా తాజా బడ్జెట్ లో గరిష్ట వార్షికాదాయాన్ని రూ. 12 లక్షల వరకు పెంచడాన్ని కూడా గొప్పగా చెప్పుకున్నది. జీఎస్టీ 2.0 సంస్కరణలను బడ్జెట్ విప్లవంగా, ఆదాయపు పన్ను తగ్గింపుతో కలిపి డబుల్ బోనాంజా ఇచ్చామని స్వయంగా ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
గబ్బర్ సింగ్ టాక్స్ :
జీఎస్టీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో గబ్బర్ సింగ్ టాక్స్ అంటూ విమర్శించారు. పేదలు నిత్యం వినియోగించే కనీస అవసరాలను తీర్చే వస్తువులపైనా జీఎస్టీ మోపి దయ, కనికరం లేని తీరులో వ్యవహరించారని ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. వీటికి కౌంటర్ గా బీజేపీ నేతలు సైతం విరుచుకుపడ్డారు. జీఎస్టీ విధానాన్ని తొలుత తెరమీదకు తెచ్చిందే యూపీఏ హయాంలో కాంగ్రెస్ పార్టీ అని, దానికి కొనసాగింపుగానే ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిందని సమర్ధించుకున్నారు.
మరోవైపు తాజా సంస్కరణలతో సొంత ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయని, దీన్ని పరిహారం రూపంలో కేంద్రమే ఆర్థికంగా ఆదుకోవాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. ఇంతకాలం హెల్త్ ఇన్సూరెన్స్ మీద వసూలు చేసిన జీఎస్టీ గురించి కేంద్రం నుంచి క్లారిటీ లేదు. జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చే తేదీ సెప్టెంబరు 22 అయినా, ఒక రోజు ముందు హెల్త్ ఇన్సూరెన్సును రెన్యూవల్ చేసుకున్నవారూ 28% పన్నును చెల్లించారు. దీనికీ కేంద్రం నుంచి రిలీఫ్ అందలేదు.
పొలిటికల్ మైలేజ్ ఎంత?
పొలిటికల్ గా ఎదురవుతున్న నష్టాన్ని పూడ్చుకునే తీరులో ప్రధాని మోడీ జీఎస్టీ 2.0 సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, ఇది ఏ మేరకు మైలేజ్ ఇస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సామాన్యులకు ఊరట కల్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నా.. ఇంతకాలం వారిని పన్నుల రూపంలో ఇబ్బంది పెట్టినట్లు చెప్పకనే చెప్పినట్లయింది. నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఇంతకాలం వసూలు చేసిన పన్నులను తిరిగి చెల్లించాలన్న రాజకీయ డిమాండ్లూ పొలిటికల్ పార్టీల నేతల నుంచి వినిపిస్తున్నాయి. బీజేపీ తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 విధానంతో ఆ పార్టీకి మైలేజ్ వస్తుందా?.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మంత్రం పనిచేస్తుందా?.. వాస్తవ సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే దీన్ని తెరపైకి తెచ్చారన్న విమర్శలు పనిచేస్తాయా?.. వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది.
వ్యాపారుల ఆఫర్ ల మేళా :
జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా పాల ఉత్పత్తుల మొదలు కార్ల వరకు భారీ స్థాయిలో పన్నులు తగ్గాయని, తగ్గింపు ధరలతో కొనాలంటూ వ్యాపార, వాణిజ్య, మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు కుప్పలు తెప్పలుగా ప్రకటనలు గుప్పించాయి. ఈ సందడిలో కొంతమంది కొనుగోళ్ళ షెడ్యూలును కూడా సెప్టెంబరు 22 వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఆ రోజు నుంచి జీఎస్టీ 2.0 లాంఛనంగా అమలులోకి వచ్చినందున. కొనుగోలుదారులకు ఊరటి ఇస్తున్నట్లు గొప్పగా చెప్పుకున్నాయి. కొనుగోళ్ళను పెంచుకోడానికి కొత్త విధానానికి శ్రీకారం చుట్టాయి. కానీ అప్పటివరకు భారీ స్థాయిలో పోగేసుకున్న లాభాల గురించి మాట్లాడలేదు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు వ్యాపారవర్గం జీఎస్టీ 2.0 సంస్కరణలను బడ్జెట్ ఉత్సవంగా, ఆర్థిక విప్లవంగా కీర్తిస్తున్నాయి. ప్రజలపై నేరుగా పన్ను భారం వేసే జీఎస్టీ ద్వారా ఇప్పటివరకు జరిగిన పొలిటికల్ డ్యామేజీని 2.0 సంస్కరణల పేరుతో దిద్దుకోవాలని బీజేపీ భావిస్తున్నది.

