కలం, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక స్కోరర్‌గా ఉన్న కోహ్లీ రికార్డ్‌పై పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేయడంపై తన ఫోకస్ లేదని, పాకిస్థాన్ జట్టును గెలిపించడమే తన లక్ష్యమని అన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ పరుగుల విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న ఫర్హాన్.. టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. సాహిబ్‌జాదా ఫర్హాన్ ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనే 220 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2014 టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ నెలకొల్పిన 319 పరుగుల ఆల్-టైమ్ రికార్డును ఫర్హాన్ బద్దలు కొడతాడంటూ చర్చ మొదలైంది.
మంగళవారం ఇంగ్లండ్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు కాండీలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఫర్హాన్ (Sahibzada Farhan) ఈ రికార్డులపై స్పందించాడు. వ్యక్తిగత మైలురాళ్లు లేదా రికార్డులపై తాను దృష్టి పెట్టడం లేదని ఫర్హాన్ స్పష్టం చేశాడు. ఇన్నింగ్స్‌ను వీలైనంత లోతుగా తీసుకెళ్లి పాకిస్థాన్‌కు విజయాలు అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని తెలిపాడు. రికార్డులు అనేవి బద్దలు కావడానికే ఉంటాయని, కానీ ప్రస్తుతం తన ఆలోచనలన్నీ కేవలం జట్టు కోసం అత్యధిక పరుగులు చేయడమేనని వెల్లడించాడు.
ప్రస్తుతం సూపర్-8 దశలో న్యూజిలాండ్‌తో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాకిస్థాన్ కేవలం ఒక్క పాయింట్‌తో ఉంది. మరోవైపు ఆదివారం శ్రీలంకపై ఘనవిజయం సాధించిన ఇంగ్లండ్ పూర్తి ఫామ్‌లో కనిపిస్తోంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఇంగ్లండ్, శ్రీలంకలతో జరగబోయే తదుపరి మ్యాచులు పాకిస్థాన్‌కు అత్యంత కీలకం కానున్నాయి. సెమీస్ దిశగా పాక్ అడుగులు వేయాలంటే ఫర్హాన్ ఇదే జోరును కొనసాగించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తానన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Read Also: 20సార్లు తప్పించుకొని.. 21వ సారి హతం
Follow Us On : WhatsApp


