కలం/ఆలేరు: యాదాద్రి (Yadadri) నరసింహుడు సోమవారం ‘గోవర్ధన గిరిధారి’గా దర్శనమిచ్చారు. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో లక్ష్మీ నరసింహుడుని గోవర్ధనగిరిధారిగా ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. నందుడి రాజ్యంలో ఇంద్రుడి ఆజ్ఞతో అగ్ని దేవుడు మేఘాల ద్వారా కురిపించిన రాళ్ల వర్షం నుంచి గోపాలులను రక్షించిన ఘట్టాన్ని అలంకరించారు. శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్థన పర్వతాన్ని ఎత్తిపట్టి గోపాలుల ను రక్షించిన మహిమలను అర్చకులు ఈ అలంకార వైభవా న్ని భక్తులకు వివరించారు. పట్ టుపీతాంబరాలు ధరించిన శ్రీకృష్ణ పరమాత్మ ఒకచేతిలో పిల్లనగ్రోవి, మరో చేతి చిటికెన వేలిపై గోవర్థన పర్వతాన్ని అలంకరించి ఆలయ మాడ విధుల్లో ఊరేగించారు. మండపంలో చతుర్వేదాలు, మూలమంత్ర జపాలు చేస్తున్న రుత్వికగణం ముందు నడుస్తుండగా, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వైభవంగా ఊరేగించారు.
రాత్రి సింహవాహనంపై కొలువు తీరనున్న స్వామివారు
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు నారసింహుడిగా అవతరించిన స్వామివారు సోమవారం రాత్రి మృగరాజు సింహవాహనంపై భక్త జనుల పూజలు అందుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రివేళ స్వామివారు దివ్యవాహన సేవలు అందుకోవడం ఆలయ సంప్రదాయం. పట్టువస్త్రాలు, ముత్యాల, బంగారు ఆభరణాలతో తేజోరూపుడు నారసింహుడు అడవికే రాజైన సింహవాహనంపై అధిష్ఠించి భక్తులకు దర్శనమివ్వనున్నాడు.


