కలం, వరంగల్ బ్యూరో: ఒకప్పుడు వరంగల్ జిల్లా మావోయిస్టులకు (Maoist) కంచుకోట. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో (Operation Kagar) నేడు ఉనికి లేకుండాపోయింది. కేంద్ర బలగాల ముమ్మర గాలింపు చర్యల నేపథ్యంలో జిల్లా అగ్రనేతల్లో పలువురు హతంకాగా, మరికొందరు అనారోగ్య సమస్యలతో సరెండర్ అయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక్కరే మిగిలి ఉన్నాడు. అతడే తెలంగాణ (Telangana) రాష్ట్ర కార్యదర్శిగా బడే దామోదర్ (Bade Damodar). ఇటీవల ఆయన లొంగిపోయినట్టు ప్రచారం జరిగింది. తాజాగా మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి, మరికొందరు లొంగిపోతున్నట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు. వీరిలో దామోదర్ కూడా ఉన్నారని జిల్లాకు చెందిన పలువురు భావించారు. కానీ దామోదర్ లేరని స్పష్టత రావడంతో ఎక్కడ ఉన్నాడనే విషయమై తీవ్ర చర్చ జరుగుతోంది.
దామోదర్ జాడేదీ?
బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ది ములుగు (Mulugu) జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. మావోయిస్టు పార్టీలో కీలక నేత. 2008లో తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన బడే నాగేశ్వర్‌రావుకు సోదరుడు. చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీ భావజాలానికి ఆకర్షితులై 1993లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరి మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఏటూరు నాగారంలో పదోతరగతి వరకు చదువుకున్న దామోదర్ ములుగు, భూపాలపల్లి అటవీ ప్రాంతంపై మంచి పట్టు సంపాదించాడు. రిక్రూట్‌మెంట్‌తోపాటు ఇన్‌ఫార్మర్లపై దాడులు చేయడంలో దిట్ట. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాకలో బీఆర్‌ఎస్ నేత భీమేశ్వర్‌రావు, ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన హోంగార్డు ఈశ్వర్ హత్యల వెనుక దామోదర్ వ్యూహం ఉన్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి.
లొంగిపోతాడా? పట్టుబడతాడా?
గతేడాది జనవరిలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్ మృతి చెందినట్లు వార్తలొచ్చాయి. కానీ మావోయిస్టు పార్టీ ఖండించింది. ఆ తర్వాత పోలీసుల అదుపులో దామోదర్ ఉన్నారనే వార్త బయటకు రావడం చర్చనీయాంశమైంది. అయితే దామోదర్ పోలీసులకు దొరకలేదని ఆయన స్వగ్రామంలో ప్రచారం జరిగింది. మేడారం జాతరకు ముందు దామోదర్ స్వగ్రామానికి వచ్చినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. తన అనుచరులతో సుమారు రెండు నెలల పాటు మేడారం పరిసరాల్లోనే గడిపినట్లు సమాచారం. జాతర ముగియగానే అక్కడి నుంచి గోదావరి తీరం వెంబడి మహారాష్ట్ర సరిహద్దులోని సురక్షిత ప్రాంతానికి తరలివెల్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు ములుగు ((Mulugu) వెంకటాపూర్ అటవీ ప్రాంతం, కర్రెగుట్టల్లో (Karregutta) కూంబింగ్ నిర్వహించాయి. పోలీసులు దామోదర్ ఆచూకీ కనిపెట్టెందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరీ దామోదర్ ప్రభుత్వం ఎదుట లొంగిపోతాడా? లేదా పోలీసులకు పట్టుబడతాడా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


