కలం, స్పోర్ట్స్: టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భారత్‌పై దక్షిణాఫ్రికా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. భారత బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరుగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు ఎక్కడ తడబట్టారు, సఫారీ పేసర్లు ఎక్కడ సక్సెస్ అయ్యారు అన్న అంశాన్ని భారత బ్యాటింగ్ కోచ్ రియాన్ టెన్ డోషేట్ (Ryan ten Doeschate) విశ్లేషించారు. భారత బ్యాటర్ల వైఫల్యానికి ప్రధాన కారణం ప్రత్యర్థి పేసర్ల అద్భుతమైన బౌలింగేనని రియాన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ పోరులో భారత బౌలర్లు రాణించినప్పటికీ, ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా బౌలింగ్ విభాగమే పైచేయి సాధించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పేసర్లు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారని టెన్ డోషేట్ (Ryan ten Doeschate) ప్రశంసించారు. ముఖ్యంగా లుంగీ ఎన్గిడి వేసిన స్లోయర్ బాల్స్, ఫుల్ లెంగ్త్ డెలివరీలను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు కష్టమైందని అన్నారు. ఈ తరహా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి తాము వారం రోజులుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ, మైదానంలో వాటిని అమలు చేయడంలో విఫలమయ్యామని ఆయన అంగీకరించారు. సఫారీ పేసర్లు భారత బ్యాటర్లకు చేతులు విప్పి ఆడే అవకాశం ఇవ్వలేదని, అదే రెండు జట్ల మధ్య తేడాను చూపిందని కోచ్ విశ్లేషించారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 22 పరుగులిచ్చి 4 వికెట్లతో చెలరేగగా, కోర్బిన్ బాష్ 12 పరుగులకే 2 వికెట్లు తీశారు. ఎన్గిడి వికెట్లు తీయకపోయినప్పటికీ, తన 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌పై ఒత్తిడి పెంచారు. తమ వ్యూహాలను అధిగమించి సఫారీ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేశారని, అందుకే తాము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని టెన్ డోషేట్ పేర్కొన్నారు. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని, రాబోయే మ్యాచుల్లో బ్యాటింగ్ విభాగం మెరుగైన ప్రదర్శన చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Also: తుది జట్టులోకి సంజూ శాంసన్? కోచ్ కీలక వ్యాఖ్యలు!
Follow Us On: Sharechat


