కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ‘ఏఐ పాలసీ సింపోజియం’లో ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వాన లేఖను పంపించారు. ఈ ఏడాది మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్‌లోనే ఈ కార్యక్రమం జరుగనుంది. భారత్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకోవటం విశేషం.
ఈ సింపోజియంలో “AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే ప్యానెల్లో ప్రసంగించాలని సీఎంను ఆహ్వానించారు. ఈ సెషన్లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
ఏఐ ఎకోసిస్టమ్ డెవలప్, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించాలని సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు సీఎంను ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఏఐ పాలన, జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనేబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇటీవలే హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో జరిగిన లీడర్షిప్ కోర్సు తరగతులకు ఐదు రోజుల పాటు హాజరైన సంగతి తెలిసిందే. కోర్సు విజయవంతంగా పూర్తిచేసి సర్టిఫికెట్‌ను కూడా అందుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ మరోసారి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈసారి స్టూడెంట్‌గా కాదు.. స్పీకర్‌గా ఆయన పాల్గొంటారు.


