కలం, వెబ్ డెస్క్: తమిళనాడు శాసనసభకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమిళ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) బరిలోకి దిగుతోంది . ఈ క్రమంలో టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి అందిరిలోనూ ఉంది. దీనిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున ఆదివారం మీడియాతో మాట్లాడారు.
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఉత్తర నియోజకవర్గాల్లో ఏదో ఒకదాని నుంచి విజయ్ పోటీ చేస్తారని అర్జున వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైలో మూడు లోక్సభ నియోజకవర్గాలు.. సెంట్రల్ చెన్నై, నార్త్ చెన్నై, సౌత్ చెన్నై ఉన్నాయి. వీటిలో నార్త్ చెన్నై పరిధిలోకి ఆరు నియోజవర్గాలు వస్తాయి. అవి.. తిరువొత్తియూర్, డాక్టర్.రాధాకృష్ణ నగర్, పెరంబూర్, కొలత్తూర్, తిరువిక నగర్, రాయపురం. ఈ ఆరింటిలో రాయపురం అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ పోటీ చేస్తారని మొదటి నుంచి ఊహాగానాలు వినిపిస్తాయి. ఈ క్రమంలో టీవీకే జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున్ వ్యాఖ్యలు దీనిని బలపరుస్తున్నాయి.
కాగా, వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి, అధికారంలోకి వస్తామని ఇప్పటికే విజయ్ (TVK Chief Vijay) పదే పదే చెబుతున్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో పార్టీని సిద్ధం చేస్తున్నారు. బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటు మొదలుకొని అన్ని కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం విజయ్ తన శక్తియుక్తులన్నీ ధారపోస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మే 10లోగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
డీఎంకేకు డీఎండీకే మద్దతు:
శాసనసభ ఎన్నికలు సమీపించే కొద్దీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలోని అధికార డీఎండీకేకు మద్దతు పెరుగుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి నమ్మిన బంటుగా పేరొందిన మాజీ సీఎం పన్నీరుసెల్వం రెండు రోజుల కిందట స్టాలిన్ కలసి తన మద్దతు ప్రకటించారు. అలాగే, డీఎండీకే సైతం డీఎంకేతో కలసి పోటీ చేయనున్నట్లు తెలిపింది. దివంగత నటుడు విజయకాంత్ స్థాపించిన డీఎండీకే పార్టీకి ప్రస్తుతం ఆయన భార్య ప్రేమలత నేతృత్వం వహిస్తున్నారు.
ఈ క్రమంలో అధికార డీఎంకే–కాంగ్రెస్ కూటమికి ప్రతిపక్ష ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమికి మధ్య పోరు హోరాహోరీ సాగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ రెండు బలమైన కూటముల మధ్య విజయ్ పార్టీ ఏమేరకు ప్రభావం చూపుతుంది? ఎవరి ఓటు బ్యాంకును దెబ్బకొడుతుంది? అనే చర్చలు నడుస్తున్నాయి.
Read Also: డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి : ప్రధాని మోదీ
Follow Us On: Instagram


