Mobile Popup Ad
Mobile Popup Ad

డిజిటల్​ మోసాలపై అప్రమత్తంగా ఉండండి : ప్రధాని మోదీ

కలం, వెబ్​ డెస్క్: డిజిటల్​ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విజ్ఞప్తి చేశారు(Mann Ki Baat). ప్రస్తుతం డిజిటల్ వినియోగంపై అవగాహన పెరుగుతున్నా.. మోసాలు మాత్రం కొనసాగుతున్నాయని ఆయన హెచ్చరించారు. డిజిటల్​ మాధ్యమాల వాడడంపై జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కేవైసీ ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఆదివారం ప్రధాని మోదీ 131వ ‘మన్​ కీ బాత్​’లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్​ సమ్మిట్​ను ప్రస్తావిస్తూ.. ఈ సదస్సు ద్వారా భారత్​ ప్రపంచ ఏఐ హబ్​గా మారుతోందనే సంకేతాన్ని అందించిందని చెప్పారు. కృత్రిమ మేధ సాయంతో టెక్నాలజీ డెవలప్​మెంట్​ మాత్రమే కాకుండా ఆరోగ్యం, వ్యవసాయం, పాడిపరిశ్రమ, పశుసంవర్థక వంటి విషయాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్​లు, టెక్నాలజీ ప్రోడక్ట్స్​ తయారీదారులు అంతర్జాతీయ మార్కెట్​కు అనుగుణంగా అత్యత్తమ నాణ్యత, ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. ఏఐ, అంతరిక్ష పరిశోధనలు, సెమీ కండక్టర్లు, గ్రీన్​ ఎనర్జీ వంటి రంగాల్లో భారత్​ను ప్రపంచానికి కేంద్రంగా చేసేలా పనిచేయాలని ఆయన కోరారు.

అవయవదానంతో ప్రాణదానం..

ఇటీవల కేరళలకు చెందిన పది నెలల చిన్నారి అలీన్ షెరిన్​ అబ్రహాం అవయవదానం గురించి ప్రధాని ప్రస్తావించారు(Mann Ki Baat). చిన్నారిని, ఆమె కుటుంబాన్ని ప్రశంసించారు. ప్రాణాలను కాపాడే అవయవదానంపై అవగాహన పెరుగుతోందనడానికి ఇదో గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. ఒడిశాకు చెందిన యువ రైతు హిరోద్​ పటేల్​ గురించి మాట్లాడుతూ.. సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న హిరోద్​.. గత ఎనిమిదేళ్లలో వ్యవసాయాన్ని ఆధునిక దృక్పథంలో ముందుకు తీసుకెళ్లిన విధానాన్ని కొనియాడారు.

సాంస్కృతిక వారసత్వ అథ్లెట్లు..

ప్రస్తుతం జరుగుతోన్న టీ20 ప్రపంచకప్​లో వివిధ దేశాల తరఫున భారత సంతతి క్రీడాకారులు ఆడుతుండడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా, కెనడా, ఒమన్ దేశాల క్రికెట్​ జట్లలోని భారతీయ మూలాలున్న క్రికెటర్ల పేర్లను ప్రస్తావించారు. వాళ్ల జెర్సీ వేరయినప్పటికీ ఆ పేర్లు వినగానే వాళ్లంతా మనవాళ్లే అనే భావన భారతీయుల్లో కలుగుతుందని చెప్పారు. ఇదొక అద్భుతమైన అనుభవమన్నారు. విదేశాల తరఫున క్రీడల్లో పాల్గొంటున్న భారత సంతతి క్రీడాకారులు మన దేశ సాంస్కృతిక వారసత్వానికి వారధులని ప్రశంసించారు.

కాగా, ఈ రోజు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతిని పురస్కరించుకొని ఆమెకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. తమిళనాడుకు, దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>