కలం డెస్క్ : ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను గద్దెనెక్కిన తర్వాత ఆచరించకపోతే ఏమవుతుంది?.. ప్రజల అవసరాలను తీర్చకపోతే, పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది?.. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే, రోడ్డెక్కితే దాని ఫలితం ఎలా ఉంటుంది?.. మొన్న శ్రీలంకలో. నిన్న బంగ్లాదేశ్ లో చూశాం. నేడు నేపాల్ దేశంలోనూ ఇప్పటికీ చూస్తున్నాం. పాలకులను తరిమికొడతాం.. గద్దె మీద నుంచి దించేస్తాం.. ప్రభుత్వాలనే మార్చేస్తాం అని పోరాటాల ద్వారా పాలకులకు హెచ్చరిక చేశారు. ఈ దేశాలు మాత్రమే కాదు.. దక్షిణాసియాలోని పలు దేశాల్లో ఇదే తరహా అసహనం వెల్లువెత్తున్నది. అందుకే విదేశీ మీడియా దీన్ని ‘సౌత్ అసియా స్ప్రింగ్’ అని అభివర్ణిస్తున్నారు. చరిత్రలో గతంలో ‘అరబ్ స్ప్రింగ్’ పోరాటంతో స్ఫూర్తి పొంది ప్రజలు చైతన్యంతో నిరసనలకు శ్రీకారం చుట్టారు. పాలకుల అవినీతిపై తిరగబడుతున్నారు. దేశాధ్యక్షుల అధికార నివాసాలపై దాడులు చేస్తున్నారు. ఈ పోరాటాలేవీ పకడ్బందీ ప్లాన్ తో నిర్వహించినవి కావు. అప్పటికప్పుడు వేర్వేరు ఆందోళనలతో ఒక్కటైనవే. కట్టలు తెంచుకున్న ఆగ్రహం, అసహనానికి ప్రతీకలే ఈ పోరాటాలు. మౌనంగా ఉండే రోజులు పోయాయని హెచ్చరించారు. ప్రభుత్వాలనే మార్చేస్తామని నిరూపించారు. పాలనా వ్యవస్థనే తిరస్కరించారు.
యువత తల్చుకుంటే… :
నాడు శ్రీలంకలోగానీ, ఆ తర్వాత బంగ్లాదేశ్ లోగానీ, తాజాగా నేపాల్ లో గానీ వెల్లువెత్తిన ప్రజాగ్రహంలో యువతదే కీలక పాత్ర. అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటు ఉద్యమాలు, పోరాటాలు ఆ దేశాల్లో పాలకులను గద్దె మీద నుంచి దించేశాయి. పాలనలో కుటుంబ వారసత్వాన్ని యువత ప్రశ్నించింది. ఆ ఆందోళనలు రాజకీయ వ్యవస్థలనే కదిలించాయి. ప్రజల చైతన్యం, నిరసనల శక్తికి ఇవి ప్రతిబింబాలు. పాలకులు విలాసాల్లో మునిగి తేలుతూ ఉంటే ప్రజలు కటిక దరిద్రంలో కూరుకుపోవడాన్ని సహించలేకపోతున్నారు. ఆర్థిక సంక్షోభాలకు కారణమవుతూ ఆహారం కొరత ఏర్పడడంతో పోరాటాలే మార్గమని భావించారు. ఒకవైపు ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, ఆర్థికంగా బలహీనులు కావడం, అదే సమయంలో పాలకులు రాజభోగాలతో సుఖాలను అనుభవించడాన్ని తట్టుకోలేకపోయారు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత హామీలను గాలికి వదిలేయడంతో మరో గత్యంతరం లేక యువత, విద్యార్థులు, పౌరులు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నారు.
శ్రీలంకలో తోక ముడిచిన రాజపక్సే :
మూడేండ్ల క్రితం (2022 ఏప్రిల్ లో) శ్రీలంలో ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించారు. అప్పటి అధ్యక్షుడు రాజపక్సే అధికారం నివాసంలోకి జొరబడి అందినకాడికి ఆస్తుల్ని ఎత్తుకెళ్ళారు. అధ్యక్ష భవనంవైపు వెళ్ళడానికే సాహసించని ప్రజలు తిరుగుబాటుతో లోపలకు వెళ్ళి కుర్చీల్లో కూర్చుని, పరుపు మంచంపై సేదతీరి హెచ్చరిక చేశారు. ‘గొటా.. గో గామా..’ (రాజపక్సే పూర్తి పేరు గొటబాయ రాజపక్సే) అంటూ నినదించారు. ఆయన దేశం విడిచి పారిపోక తప్పలేదు. చివరకు అధ్యక్ష భవనాన్ని ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా పాలించే వ్యక్తుల్ని ప్రజలు కోరుకున్నారు. కొంతకాలం ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘె పాలించినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మార్కిస్టు భావజాలం కలిగిన అనుర కుమార దిశనాయకేను దేశ అధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకున్నారు.
బంగ్లాదేశ్ లో షేక్ హసీనా.. :
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా విధానాన్ని ప్రవేశపెట్టిన బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనాపైనా విద్యార్థులు గతేడాది (2024లో) తిరుగుబాటు చేశారు. అవినీతి పాలనతో పాటు యువత భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసే విధానాలను ప్రశ్నించారు. అసంతృప్తి, అసహనం ఆగ్రహంగా మారింది. సోషల్ మీడియా వేదికతో యువత ఒక్కటయ్యారు. ఆన్ లైన్ ఉద్యమంగా మారింది. అప్పటికప్పుడు మీమ్స్ రూపంలో యువత, విద్యార్థుల్ని ఆ ఉద్యమం ఏకం చేసింది. ప్రజాగ్రహ తీవ్రతకు భయపడి రాజీనామా చేయక తప్పలేదు. ఆ దేశ అధ్యక్షురాలి భవనాన్ని ప్రజలు ముట్టడించి వ్యక్తిగత వస్తువులను ప్రజలు ధ్వంసం చేశారు. చివరకు ఆమె లోదుస్తులను సైతం వదల్లేదు. భయపడిపోయి భారత్ లో ఆశ్రయం పొందారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు.
నేపాల్ లో బంధుప్రీతికి నిరసన :
ప్రజలు వారి అభిప్రాయాలను వెల్లడించడానికి మార్గం లేకపోవడంతో సోషల్ మీడియా ఏకైక దిక్కుగా మారింది. ప్రజల సమస్యలను ప్రధాన మీడియా ప్రస్తావించకపోవడం, నిర్లక్ష్యం చేయడంతో సోషల్ మీడియా వేదికైంది. విద్యార్థులు, యువత తిరుగుబాటు బావుటాను ఎంచుకున్నారు. పాలనలో అవినీతి పెరిగిపోవడం, పాలకుల బంధువర్గం విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉండడం.. ఇలాంటివన్నీ యువతలోని అసహనానికి ఆజ్యం పోశాయి. ఈ అసంతృప్తిని, భావ ప్రకటనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీన్ని సహించలేని ప్రధాని ఖడ్గప్రసాద్ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించింది. చివరకు వీధి పోరాటాలు మార్గమయ్యాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టి ఆగ్రహాన్ని ప్రదర్శించక తప్పలేదు. రాజీనామా చేసి వెళ్ళిపోయే పరిస్థితిని సృష్టించారు. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుశీలా కార్కి తాత్కాలిక ప్రధానిగా నియమితులయ్యారు.
గతంలో ఆకలిదాడులు :
నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు గడీల మీద దాడి చేసి నిరసనను తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు గతంలో ఆకలి దాడులు, కరువుదాడులు చేశారు. గోదాముల్లో నిల్వ చేసిన ఆహార పదార్ధాలను ఎత్తుకెళ్ళారు. పాలకులను, పెత్తందార్లను హెచ్చరించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా పేదరికం, కరువు కొనసాగడంతో రైతులు, కూలీలు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని పలు రేషను దుకాణాలపై 1970వ దశకంలో దాడులు చేశారు. భూస్వాముల గోదాముల్లోని ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1990వ దశకం తర్వాత దేశంలో అమలులోకి వచ్చిన ఆర్థిక సంస్కరణలతో పేదల బతుకులు ప్రశ్నార్థకంగా మారడంతో సిరిసిల్ల, మంగళగిరి (ఆంధ్రప్రదేశ్) ప్రాంతాల్లో ఆకలి దాడులు తప్పలేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అసమర్ధత, అవినీతి కారణంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరడంలేదని సంఘటితులయ్యారు.
సంక్షేమ పథకాలతోనే సరిపెట్టడానికి బదులు జీవితాల్లోనే మార్పు రావాలని భావించారు. ఇలాంటి ఘటనల తర్వాతనే ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి హామీ పథకం, రేషను దుకాణాల ద్వారా సబ్సిడీ బియ్యం పంపిణీ, పేదలకు రేషను కార్డుల జారీ, మెరుగైన వైద్యానికి ఆరోగ్యశ్రీ భరోసా.. ఇలాంటివన్నీ ఉనికిలోకి వచ్చాయి. ప్రజల అసహనం, అసంతృప్తి ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటే పాలనా సౌధానికే ఎసరు వస్తుందని శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో జరిగిన ప్రజాందోళనల ద్వారా స్పష్టమవుతుంది. పాలకులకు ఈ ఘటనలు ఒక హెచ్చరిక లాంటివి. భవిష్యత్తులో ఏ దేశంలో ఇలాంటివి చోటుచేసుకుంటాయోననే చర్చలు లేకపోలేదు.
• ప్రభుత్వాల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 2010-12 మద్యలో మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)లో యువత తిరుగుబాటు చేసింది.
• సాంఘిక సంస్కరణలను డిమాండ్ చేస్తూ విద్యార్థులు, కార్మికులు కలిసి 1960వ దశకం చివర్లో ఫ్రాన్స్ లో ఉద్యమించారు.
• ప్రజాస్వామ్యం కోసం 1980వ దశకం చివర్లో విద్యార్థులే నాయకత్వం వహించిన చైనాలోని తియాన్ మెన్ స్క్వేర్ ఉద్యమం యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
• హాంకాంగ్ పై చైనా ఆధిపత్యాన్ని,అజమాయిషీని ప్రశ్నిస్తూ 2010వ దశకం చివర్లో యువత రోడ్డెక్కారు.
• అవినీతికి వ్యతిరేకంగా గతేడాది కెన్యా యువత సోషల్ మీడియా వేదికగా ఒక్కటై పాలనా వ్యవస్థను ప్రశ్నించారు.
• ఆర్థిక అసమానతలకు నిరసనగా ఆక్యుపై వాల్ స్ట్రీట్ పేరుతో 2010 దశకం ప్రారంభంలో నూతన ఉద్యమ రూపం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఆలోచనలకు గురిచేసింది.

