కలం, నిజామాబాద్ : ఆశా వర్కర్లు (ASHA Workers) తమ సమస్యల పరిష్కారం కోసం రాజధాని బాట పడుతున్నారు. నిజామాబాద్ (Nizamabad) సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల విషయమై సిఐటియు(CITU) జిల్లా కార్యదర్శి నూర్జహాన్ (Noorjahan) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్‌తో.. ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో నిర్వహించే “ఛలో హైదరాబాద్”(Chalo Hyderabad) కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆశా కార్యకర్తలు ప్రజారోగ్య రంగంలో ముఖ్య భూమిక పోషిస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు, శిశువులు, బాలింతల సంరక్షణలో కీలకంగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు.
అయినప్పటికీ, వారికి తగిన పారితోషికం, భద్రత, గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన డిమాండ్లు వెల్లడిస్తూ.. పెండింగ్‌లో ఉన్న పారితోషికాలు బిల్లులు తక్షణమే చెల్లించాలి. ఆశా కార్యకర్తలకు కనీసం రూ. 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలి. ఎన్సీడీ (NCD) సర్వే పేరుతో పెరుగుతున్న అదనపు పనిభారం తగ్గించాలి. ANC, PNC టార్గెట్ల పేరుతో ఒత్తిళ్లు నిలిపివేయాలని, ఆశాల పనిభారానికి అనుగుణంగా సదుపాయాలు, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆశాలు ప్రజారోగ్య వ్యవస్థకు బలమైన స్తంభాలుగా ఉన్నప్పటికీ, వారికి న్యాయం జరగకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే, పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆశా కార్యకర్తలందరూ ఫిబ్రవరి 23న నిర్వహించే “ఛలో హైదరాబాద్” (Chalo Hyderabad) కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.


