కలం, తెలంగాణ బ్యూరో : Telangana Political Fight | “ఈసారి అధికారం మాదే.. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చేస్తాం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం..” ఇవన్నీ బీజేపీ నేతలు తరచూ చేసే కామెంట్స్. ఇకపైన రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సంగతి ఎలా ఉన్నా తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని అసంతృప్తికి గురిచేశాయి. రాష్ట్రంలో దాదాపు 45 లక్షల సభ్యత్వం ఉన్నా అటు పంచాయతీ ఎన్నికల్లో ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఫెయిల్ అయ్యాం అనేది హైకమాండ్ వాదన. స్థానిక సంస్థల ఎన్నికలపై పోస్టుమార్టం చేసిన బీజేపీ సెంట్రల్ లీడర్‌షిప్ రాష్ట్ర నాయకత్వం నుంచి వివరణ కోరింది. పదవులు అనుభవిస్తూ పార్టీని బలోపేతం చేయకపోవడంపై సీరియస్‌గా ఉన్నది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండి ప్రయోజనమేంటి? :
రాష్ట్రంలో ఏడుగురు ఎమ్మెల్యేలున్నా (హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మినహాయించి) వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క చోట కూడా మున్సిపల్ చైర్‌పర్సన్ పోస్టును దక్కించుకోలేకపోయింది. ఏడుగురు ఎంపీలు (సికింద్రాబాద్ మినహాయించి) ఉన్నా కరీంనగర్ కార్పొరేషన్ మినహా ఇంకెక్కడా మున్సిపల్ చైర్‌పర్సన్ లేదా కార్పొరేషన్ మేయర్ చేజిక్కించుకోలేకపోయింది. కొన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా ఫలితం లేకపోయింది. కొన్ని చోట్ల ఎక్స్ అఫీషియో ఓటు హక్కును వినియోగించుకోవడంలోనూ పార్టీ నిబంధనలను గాలికి వదిలేసినట్లు పార్టీ కేంద్ర నాయకత్వం గుర్తించింది. ఏడుగురు ఎమ్మెల్యేలున్నా వారి ప్రాంతాల్లో ఓట్లు ఎందుకు పడలేదు? కౌన్సిలర్లను ఎందుకు గెలిపించుకోలేదు? ఇలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెట్లా?.. ఇవీ కేంద్ర నాయకత్వం సంధిస్తున్న ప్రశ్నలు.
గ్రూపు తగాదాలే నిర్వాకానికి కారణమా? :
నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్.. ఇది బీజేపీ స్లోగన్. వ్యక్తిగతమైనవి చివరి ప్రయారిటీ అంటూ ఈ స్లోగన్ ద్వారా కేడర్ మొదలు లీడర్ వరకు మెసేజ్ ఇచ్చింది. కానీ నేతల మధ్య సమన్వయం, సఖ్యత కరువైందనేది రాష్ట్ర బీజేపీలో బహిరంగ రహస్యం. గ్రూపు రాజకీయాలపై గతంలో చాలా విమర్శలే వచ్చాయి. బండి సంజయ్‌కు, ఈటల రాజేందర్‌కు పొసగడం లేదనేది పార్టీలో చర్చకే దారితీసింది. ఆ ఎఫెక్ట్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో కనిపించింది. ఈటల రాజేందర్ గతంలో దీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికే వెళ్ళలేదు. పార్టీ నేతలు రానీయలేదు. బండి సంజయ్ కారణంగానే ఈటల రాజేందర్ వెళ్ళలేకపోయారనే విమర్శలూ వచ్చాయి. చివరకు హుజూరాబాద్ చేజారిపోయింది.
అవకాశమున్నా ఎందుకు వదులుకున్నట్లు? :
కొన్ని మున్సిపాలిటీల్లో ఎక్కువ వార్డుల్ని గెల్చుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా చైర్‌పర్సన్ పోస్టుల్ని ఎందుకు వదులుకున్నారన్నది కూడా పార్టీ హైకమాండ్ నోటీసులోకి వెళ్ళింది. ఉదాహరణకు మెట్‌పల్లిలో మొత్తం 26 వార్డుల్లో పది చోట్ల గెలిచి మరే పార్టీకంటే అగ్రస్థానంలో ఉన్నా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్లను ఆకర్షించి చైర్‌పర్సన్ పోస్టుని దక్కించుకోలేకపోవడం కూడా రాష్ట్ర పార్టీలో చర్చకు దారితీసింది. సొంత పార్టీ కార్పొరేటర్లు చేజారకుండా కొన్ని చోట్ల క్యాంపులకు తరలించినా పరోక్షంగా ఇతర పార్టీలకు సహకరించిన ఘటనలు కూడా పార్టీలో వివాదానికి దారితీసింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఎవరెవరు ప్రత్యర్థి పార్టీలతో సన్నిహిత సంబంధాల్లో ఉన్నారనే అనుమానాలు పొడసూపాయి.
Read Also: పైసల మంత్రికి మరో క్యాంప్ ఆఫీస్.. ఏకంగా నాలుగున్నర కోట్లు..
Follow Us On: Instagram


